టీడీపీలో టిక్కెట్ రాకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా!

ప్రతిపక్ష వైసీపీకి బలమైన జిల్లాగా ఉన్న కడప జిల్లా రాజకీయాలు ఈసారి రసవత్తరంగా మారుతున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ ఈసారి ఎలాగైనా ఎక్కువ సీట్లు దక్కించుకోవాలని భావిస్తుండగా.. తమకు ఉన్న పట్టు నిలబెట్టుకునేందుకు వైసీపీ కూడా ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకుండా సర్వశక్తులు ఒడ్డుతుంది.
Read Also : జగన్ అనే నేను : చనిపోయాకా బతికుండాలి.. అందుకే సీఎం కావాలి
ఈ క్రమంలో జిల్లాలో టిడిపి , వైకాపా లు రెండు కమలాపురం పైనే ఫోకస్ పెట్టడంతో రాజకీయంగా చర్చ ప్రారంభం అయ్యింది. ఇదిలా ఉంటే టీడీపీలో టిక్కెట్ ఫైట్ నియోజకవర్గ ఇన్ చార్జ్ పుత్తాకు, మాజీ ఎమ్మె ల్యే వీరశివారెడ్డి మధ్య జరుగుతుంది. పుత్తాకు గత ఎన్నికలలో అవకాశం ఇచ్చారు అని ఈసారి మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి అనుచరులు వాదిస్తున్నారు.
ఈ క్రమంలో వీరశివారెడ్డి శుక్రవారం తన కార్యాలయంలో మండలాల వారీగా సమావేశం నిర్వహించారు. భవిష్యత్‌లో ఎలా పావులు కదిపితే బాగుంటుందని కార్యకర్తలతో చర్చించారు. కార్యకర్తలు, నేతల నుంచి భిన్నాభిప్రాయాలు రావడంతో కార్యకర్తల ఒత్తిడి మేరకు మరోసారి అమరావతికి వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రితో కలిశాక నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.
Read Also : చంద్రబాబు లొల్లిరాజకీయాలు మానుకోవాలి : జీవీఎల్
వీరశివారెడ్డికి వయస్సు రీత్యా ఇవే చివరి ఎన్నికలు కావడంతో అనుచరులు ఈసారి ఖచ్చితంగా పోటీ చేయాలని కోరుతున్నారని చెబుతున్నారు. ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత వీరశివారెడ్డి నిర్ణయం వెల్లడికానుంది. టీడీపీ టికెట్ రాకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానంటూ ఇప్పటికే వీరశివారెడ్డి స్పష్టం చేశారు.
Read Also : కర్నూలుకు బాబు : టీడీపీలోకి కోట్ల దంపతులు