Gossip Garage : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా డీకే అరుణ..? అసలు జాతీయ నాయకత్వం వ్యూహం ఏంటి..

డీకే అరుణకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అంశంలో పార్టీ అంతర్గత అంశాలతో పాటు రాష్ట్ర రాజకీయాలు కూడా ఆమెకు కలిసి వస్తున్నాయట.

Gossip Garage : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా డీకే అరుణ..? అసలు జాతీయ నాయకత్వం వ్యూహం ఏంటి..

DK Aruna

Updated On : April 6, 2025 / 5:06 PM IST

Gossip Garage : బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పీఠం రోజుకో మలుపు తిరుగుతోంది. రోజుకో పేరు తెరపైకి వస్తోంది. గత మూడు నెలలుగా రాష్ట్ర అధ్యక్షుడు ఎవరవుతారన్న దానిపై బీజేపీ శ్రేణులతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో సైతం ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర అధ్యక్ష రేసులో ప్రస్తుతం ఓ మహిళా నేత పేరు తెరపైకి వస్తోంది. ఇంతకీ ఎవరా మహిళా నేత రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్నది..

అధ్యక్ష రేసులో ముందున్న డీకే అరుణ..!
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో ఇప్పటి వరకు చాలా పేర్లు వినిపించాయి. అందులో ప్రధానంగా ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రాం చరందర్ రావు, మురళీధర్ రావు, రఘునంధన్ రావు పేర్లు ఉన్నాయి. కొంతకాలంగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేరు కూడా వినిపిస్తుంది. అయితే బీజేపీ జాతీయ నాయకత్వం డీకే అరుణ పేరును చాలా సీరియస్ గా పరిశీలిస్తుందంట.

దేశాన్ని యూనిట్ గా తీసుకుంటే వాటిలో కొన్ని రాష్ట్రాలకు మహిళా అధ్యక్షురాళ్లను సైతం పెట్టాలన్నది బీజేపీ జాతీయ నాయకత్వం ఆలోచనలో ఉందట. దానికి రాష్ట్రంలో ఉన్న ఈక్వేషన్స్ కూడా తోడు కావడంతో డీకే అరుణ రాష్ట్ర అధ్యక్ష రేసులో ముందున్నట్టు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న నేతలతో పాటు పార్టీ శ్రేణులు కూడా వివిధ గ్రూపులుగా విడిపోయారంట. తమకే అధ్యక్ష పదవి ఇవ్వాలని నాయకులు అంటుండగా.. తమ నాయకుడు అయితేనే పార్టీని సమర్దవంతంగా నడపగలడని పార్టీ శ్రేణులు వాదించుకుంటున్నారంట . డీకే అరుణ పేరును తెరపైకి తీసుకుని రావడం ద్వారా ఒక మహిళా నేతకు రాష్ట్ర బాధ్యతలు అప్పగించినట్టు ఉంటుందని జాతీయ నాయకత్వం వద్ద చర్చ ఉందట.

Also Read : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. రెండో జాబితా వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?

దీనికి తోడు డీకే అరుణకు ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా అధిష్టానం దృష్టిలో మంచి మార్కులు కొట్టేయడంతో ఆమె పేరు బలంగా వినిపిస్తుందంట. డీకే అరుణకు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తే మిగతా నేతలు ఎవరూ వ్యతిరేకించరన్న చర్చ సైతం రాష్ట్ర కార్యాలయంలో సాగుతోందంట.

డీకే అరుణకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అంశంలో పార్టీ అంతర్గత అంశాలతో పాటు రాష్ట్ర రాజకీయాలు కూడా ఆమెకు కలిసి వస్తున్నాయట. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం, అక్కడ నుంచి కాంగ్రెస్ కు చెక్ పెట్టి మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలవడం డీకే అరుణకు కలిసి వస్తుందట. కాంగ్రెస్ హోల్డ్ లో ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని సైతం దగ్గర చేసుకునేందుకు డీకే అరుణకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించే ఆలోచనలను పరిశీలిస్తున్నారట.

Also Read : రంగంలోకి మీనాక్షి నటరాజన్.. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై కీలక వ్యాఖ్యలు

అవసరం అనుకుంటే ఫ్లోర్ లీడర్ గా ఉన్న మహేశ్వర్ రెడ్డిని పక్కన పెట్టి బీజేపీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేగా ఉన్న పాయల్ శంకర్ ను నియమించే అవకాశాలు ఉన్నట్టు చర్చ సాగుతోంది. డీకే అరుణకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం ద్వారా మహిళలను సైతం ఆకట్టుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టు చర్చ సాగుతోంది. మరి జాతీయ నాయకత్వం డీకే అరుణను అధ్యక్షురాలిగా నియమించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.