గుంటూరు తూర్పు నియోజకవర్గం : ట్రైయాంగిల్ ఫైట్

  • Published By: veegamteam ,Published On : February 20, 2019 / 06:05 AM IST
గుంటూరు తూర్పు నియోజకవర్గం : ట్రైయాంగిల్ ఫైట్

Updated On : February 20, 2019 / 6:05 AM IST

గుంటూరు : ప్రధాన పార్టీల్లో ఓవైపు వర్గపోరు, మరోవైపు అసమ్మతి సెగలతో.. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమ నేతకే టిక్కెట్‌ కేటాయించాలంటే తమ నేతకే టిక్కెట్ కేటాయించాలంటూ కార్యకర్తలు, అనుచరులు పట్టుబడుతున్నారు. గత ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన వైసీపీ మళ్లీ జెండా ఎగరవేయాలని ప్రయత్నిస్తుంటే.. ఎలాగైనా కోటలో పాగా వేయాలని టీడీపీ చూస్తోంది. జనసేన కూడా బలమైన అభ్యర్ధిని బరిలో దించేందుకు పావులు కదుపుతోంది. అసలు ఎన్నికల్లో ఏపార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారు..  గెలుపోటములు ఎలా ఉండబోతున్నాయి.

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నారు. కొన్నేళ్ళుగా ప్రధాన పార్టీలన్నీ ఆ వర్గానికి చెందిన వ్యక్తులకే టికెట్స్ కేటాయిస్తూ వస్తున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ మాత్రం ప్రయోగాత్మకంగా వైశ్య వర్గానికి చెందిన వారికి టికెట్ ఇచ్చేందుకు ఆసక్తి చూపడంతో అనేక మంది పోటీపడ్డారు. చివరకు మద్దాల గిరికి టికెట్ కేటాయించింది. వైసీపీ మాత్రం మైనార్టీ వర్గానికి చెందిన ముస్తఫాకు ఇవ్వడంతో ఆయన విజయం సాదించారు. ముస్తఫా పోగాకు వ్యాపారి అవ్వడంతో పాటు ఎంపీ రాయపాటి శిష్యుడు. మద్దాల గిరికి నామినేటెడ్ పదవి ఇచ్చి ముస్తఫాను టీడీపీలోకి తెచ్చేందుకు అప్పట్లో అనేక ప్రయత్నాలు జరిగాయి. అందుకు ముస్తఫా ఒప్పుకోలేదు.  

అధికారపార్టీ విషయానికి వస్తే ఇప్పటివరకూ ఇక్కడ అభ్యర్ధిని ఫైనల్‌ చేయలేదు. మరోవైపు సినీ నటుడు ఆలీ గుంటూరు తూర్పు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్న వార్తలు జోరందుకున్నాయి. మూడు పార్టీలకు చెందిన అధినేతలను ఆలీ కలిశారు. దీంతో గుంటూరు తూర్పు నియోజకవర్గంపై అందరి దృష్టి పడింది. టీడీపీ వచ్చే ఎన్నికల్లో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారినే రంగంలోకి దించే అవకాశాలున్నాయని ప్రచారం జరగడంతో మద్దాల గిరి అనుచరులు అతనికే టికెట్ కేటాయించాలని సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా .. బహిరంగంగా అధికార పార్టీ నేతలే గిరికి టికెట్  కేటాయించాలని .. లేదంటే రాబోయో ఎన్నిక్లలో గెలపు ఓటములపై  ప్రభావం చూపుతామని తేల్చి చెబుతున్నారు. 

వైసీపీ విషయానికి వస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే ముస్తఫాకే ఫ్యాను పార్టీ మళ్లీ టికెట్ కేటాస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన రోజు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు కూడా చేస్తున్నారు. అయితే ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ వైసీపీలో అసంతృప్తి బయటపడుతోంది. వైసీపీ ముస్థఫాకు టికెట్ ఇవ్వొద్దంటూ అసమ్మతి వర్గం పట్టుబడుతోంది.   

అటు జనసేన పార్టీ కూడా ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన వారికే టికెట్ కేటాయించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఆశావహులు ఇప్పటికే  జనసేనతో మంతనాలు జరుపుతున్నారు. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు నలభై ఆరు వేల వరకూ ఉన్నారు. ఇక కాపు, వైశ్య సామాజికవర్గం ఓటర్లు కూడా అధికంగా వున్నారు.  దీంతో ట్రయాంగిల్ ఫైట్ జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఏ సామాజిక వర్గం ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది అసక్తికరంగా మారింది.