రాజు ప్రశంసలు, రాజు నమ్మినబంటు విమర్శలు.. కన్‌ప్యూజన్‌లో పడిపోయిన సైనికులు

  • Publish Date - July 16, 2020 / 04:09 PM IST

ప్రశ్నించాల్సిన నాయకుడే ప్రశంసలు కురిపించాడు. కరోనా కష్టకాలంలో అధికార పార్టీకి అండగా నిలబడ్డాడు. అధినాయకుడిలో కలిగిన ఈ మార్పు చూసి సైన్యం దూసే కత్తుల్ని కిందకు దింపింది. ఇంతలోనే, అబ్బే అలాంటిదేమీ లేదు, కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైంది, కత్తులు దూయాల్సిందే అంటూ నాయకుడి నమ్మిన బంటు కొత్త స్టేట్ మెంట్ ఇచ్చాడు. కరోనా విషయంలో రాజుగారి స్టాండ్ ఏంటో తెలియక, సైన్యం తలలు పట్టుకుంటోంది.

బీజేపీతో కలిశాక సైలెంట్ అయిపోయిన జనసేనాని, సైనికులు:
రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి జనసేనాని పవన్‌ కల్యాణ్‌ తీరు అటు ఇటుగానే ఉంటోంది. ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతూ ఉంటారనే అపవాదు ఉంది. ఏదైనా అంశం మీద ఒకసారి మాట్లాడిన తర్వాత మళ్లీ చాలా రోజుల వరకూ దాని గురించి పట్టించుకోకపోవడం అలవాటు. ఇటీవల చాలాకాలం పాటు ఏ విషయంపైనా స్పందించకుండా ఉన్న పవన్‌.. ఈ మధ్య వైసీపీ ప్రభుత్వ చర్యల మీద రెండు మూడు ప్రకటనలు చేశారు. ముఖ్యంగా బీజేపీతో జత కలసిన తర్వాత ఆయన రాజకీయాల మీద పెద్దగా కాన్సన్‌ట్రేట్‌ చేస్తున్నట్టుగా కనిపించడం లేదని పార్టీ వర్గాలే అంటున్నాయి. పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు కూడా పెద్దగా ఏమీ చేపట్టడం లేదు. ఇతర నాయకులు కూడా ఎక్కడా ఏ విషయం మీదా స్పందించడం లేదు. పార్టీ అభిమానులు కూడా సైలెంట్‌ అయిపోయారు.

పవన్ తీరుతో కంగుతిన్న సొంత పార్టీ నేతలు:
తాజాగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌.. ప్రభుత్వానికి అనుకూలంగా రెండు ప్రకటనలు చేశారు. తొలిసారిగా జగన్‌ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ చేసిన ఆ ట్వీట్లు చూసి.. ఆ పార్టీ నేతలు కూడా కంగుతిన్నారట. మంచి పనులు చేస్తే ఎవరినైనా మెచ్చుకోవాల్సిందే. కాకపోతే రాజకీయాల్లో ఎవరైనా మంచి పని పనులు చేసినప్పుడు.. వాటిని వారి ప్రత్యర్థులు మెచ్చుకునే సందర్భాలు చాలా తక్కువగానే ఉంటాయి. కానీ, పవన్‌ కల్యాణ్‌ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. అనేకసార్లు ఏపీ సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన పవన్… రాష్ట్రంలో అంబులెన్స్‌లను ప్రవేశపెట్టినప్పుడు మాత్రం ప్రశంసించారు. కరోనా టెస్టులను ఎక్కువ సంఖ్యలో చేయడం పట్ల కూడా ఏపీ సర్కార్‌కు కితాబిచ్చారు.

పవన్‌ కామెంట్స్‌తో జరిగిన డ్యామేజ్‌ను నాదెండ్లతో కంట్రోల్‌ చేయించే యత్నం:
జగన్‌ను.. పవన్‌ ఇలా మెచ్చుకోవడం వైసీపీకి ప్లస్‌ అయ్యిందనే చెప్పుకోవాలి. రాష్ట్రంలో బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న పవన్‌.. ఆ పార్టీ స్టాండ్‌ను పట్టించుకోకుండా జగన్‌ పాలనపై ప్రశంసలు కురిపించడంతో… కమలనాథులు ఇరకాటంలో పడ్డారట. పవన్‌ జతకలసిన బీజేపీ మాత్రం అంబులెన్స్‌ల విషయంలో కొన్ని విమర్శలు చేసింది. దీనిపై సీఎం జగన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ కూడా రాశారు. ఈ సమయంలో పవన్‌ ఇలా వ్యాఖ్యానించడంతో డ్యామేజ్‌ తప్పదని గ్రహించిన బీజేపీ నేతలు… ఈ విషయాన్ని జనసేన సీనియర్‌ నేతల దృష్టికి తీసుకెళ్లారట. అయితే కరోనాపై మళ్లీ పవన్‌తోనే విమర్శలు చేయిస్తే… మాట తప్పినట్లవుతుందన్న భావనతో… నాదెండ్ల మనోహర్‌ రంగంలోకి దిగారు. మిత్రపక్షమైన బీజేపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి… కరోనా కట్టడి విషయంలో జగన్‌ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. పరీక్షల సంఖ్య పెరిగినప్పటికీ… వేగంగా విస్తరిస్తున్న కరోనాను నియంత్రించడంలో సమర్థంగా పనిచేయడం లేదని తీర్మానించారు. ఇదే అంశాలతో నాదెండ్ల మనోహర్‌ ఓ ప్రెస్‌నోట్‌ కూడా రిలీజ్‌ చేశారు.

సొంత పార్టీతో పాటు మిత్రపక్షాన్ని ఇరకాటంలో పడేసిన పవన్:
మొత్తానికి పవన్‌ కామెంట్స్‌తో జరిగిన డ్యామేజ్‌ను నాదెండ్ల మనోహర్‌ కంట్రోల్‌ చేసేందుకు ట్రై చేసినట్లు పొలిటికల్‌ సర్కిల్స్‌లో టాక్‌ వినిపిస్తోంది. మొత్తానికి పవన్ కల్యాణ్ ఏపీలో భిన్నమైన రాజకీయాలు చేస్తున్నారా? రాజకీయాలు తెలియక కన్ఫ్యూజ్‌ అవుతున్నారా? ఏదేమైనా.. మనసుకు తోచించి చెప్పి… సొంత పార్టీతో పాటు మిత్రపక్షాన్ని ఇరకాటంలో పెడుతున్నారని పొలిటికల్‌ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.