మంత్రి పదవికి కిడారి శ్రావణ్ రాజీనామా

కిడారి శ్రావణ్ కుమార్ మంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. రాజ్యాంగ నియమావళి ప్రకారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 6 నెలల్లో చట్టసభకు ఎన్నిక కావాలి. మే 10వ తేదీతో 6 నెలల సమయం ముగుస్తుంది. ఈ లోపే శ్రావణ్ తో రాజీనామా చేయించాలని సీఎం చంద్రబాబుని గవర్నర్ నరసింహన్ కోరారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుని మావోయిస్టులు హత్య చేసిన సంగతి తెలిసిందే. దీంతో కిడారి సర్వేశ్వరరావు కొడుకు కిడారి శ్రావణ్ కు మంత్రిగా ఛాన్స్ దొరికింది. కిడారి శ్రావణ్ ని చంద్రబాబు కేబినెట్ లోకి తీసుకున్నారు. 2018 నవంబర్ 11 శ్రావణ్ కుమార్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఏపీ వైద్య, గిరిజన సంక్షేమ శాఖల మంత్రిగా కిడారి బాధ్యతలు తీసుకున్నారు.
ఒక మంత్రి చట్ట సభల సభ్యుడు(అసెంబ్లీ లేదా కౌన్సిల్) కాలేకపోతే పదవిని కోల్పోవాల్సి వస్తుంది. శ్రావణ్ విషయంలో అదే జరిగితే అవమానకరంగా ఉంటుందని.. అందువల్లే 10వ తేదీలోపే శ్రావణ్‌తో మంత్రి పదవికి రాజీనామా చేయించాలని గవర్నర్ నరసింహన్ సీఎంకు సూచించినట్లు సమాచారం. ఏపీలో ఏప్రిల్ 11 పోలింగ్ జరిగింది. ఒకే విడతలో లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో శ్రావణ్ గెలిచి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని రోజులు పడుతుంది.