కోరుట్లలో ఎమ్మెల్యే దూకుడు : మంత్రి పదవి కోసమేనా?

కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ఉన్నట్టుండి ఒక్కసారిగా నియోజకవర్గంలో హడావుడి చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడు తన పని తాను చేసుకుంటూ పోయే ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నేతల తీరుపై ఒంటి కాలితో లేస్తున్నారు. పదునైన విమర్శలు చేస్తూ ఓ ఆట ఆడడం మొదలు పెట్టారంటున్నారు.
ఇదంతా చూస్తున్న ఎమ్మెల్యే అనుచరులు సారుకు ఏమైందంటు చర్చించుకోవడం మొదలు పెట్టారట. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి కావాలనే కోరికను మనసుల్లోనే పెట్టుకొని బయటకు గంభీరంగా కనిపిస్తుంటారు విద్యాసాగర్‌రావు. మంత్రి వర్గ విస్తరణ జరిగిన ప్రతిసారి తనలో ఆశలు చిగురిస్తాయి. తనను అధినేత గుర్తించి ఈసారి పదవి ఇస్తారనే ఆశ ఆయనలో మొదలవ్వడం, ఆ తర్వాత చల్లారిపోవడం సహజమేనంట.
వివాదాలకు కేరాఫ్‌గా :
కొంత కాలంగా మౌనంగా ఉంటూ వచ్చిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వ్యవహర శైలిలో అనుహ్య మార్పులు కనిపిస్తున్నాయట. వివాదాలకు దూరంగా ఉండే ఆయన ఇప్పుడు విమర్శలు చేస్తూ వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్నారనేది నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ. ఇటీవల కోరుట్ల నియోజకవర్గంలో దిశ ఘటనపై విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించి, ఏకంగా హక్కుల సంఘాలనే విమర్శించడం మొదలు పెట్టారు.
పోలీసులకు మద్దతునిస్తూ దిశ నిందితుల ఎన్ కౌంటర్‌ను బహిరంగంగానే సమర్థించడం మొదలు పెట్టారు. ఇలాంటి ఎన్ కౌంటర్‌లు చేస్తేనే తప్పు చేయాలనుకునే వారిలో భయం పుడుతుందని కామెంట్లు చేశారు. మంత్రి ఈటెల రాజేందర్ ఈ ఎన్‌కౌంటర్లను తప్పు పడితే, ఎమ్మెల్యే విద్యసాగర్ రావు మాత్రం సపోర్టు చేయడం ఏంటని అంటున్నారు. అధికార పార్టీలోనే భిన్న స్వరాలంటు ఓ వర్గం చర్చించుకోవడం మొదలు పెట్టింది.
ఆయనలో ఇంత మార్పు ఏంటి?
ఇక మీడియా సమావేశం నిర్వహించి పసుపు బోర్డు ఏర్పాటుపై మాట నిలుపుకోని బీజేపీ ఎంపీ అరవింద్ రాజీనామా చేయలంటూ డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఉన్నా… లేనట్లు కనిపించే విద్యాసాగర్ రావు దూకుడు పెంచిన తర్వాత అభివృద్ధి పనులను సీరియస్‌గా పరిశీలిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారట. తన నియోజకవర్గంలో నిర్మాణమవుతున్న ఎస్సారెస్పీ రివర్స్ పంపింగ్ పనుల వద్దకు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను తీసుకువెళ్లి ప్రాజెక్టు పని తీరును వివరించారట.
మంత్రి ఓ పని మీద వస్తే ఎమ్మెల్యే దగ్గరుండి మరీ రివర్స్ పంపింగ్‌ను చూపించారట. నియోజక వర్గంలో ఉన్న సమస్యల పై ఫోకస్ చేస్తూ పబ్లిక్‌కు మరింత టచ్‌లో ఉండడంతో ఎమ్మెల్యేలో ఇంత మార్పు ఏంటనేది కోరుట్లలో చర్చనీయంశంగా మారింది. ఈసారైనా తనను గుర్తించి మంత్రి పదవి ఇస్తారనే ఉద్దేశంతోనే ఆయన జోరు పెంచారంటున్నారు. మరి ఆయన ఇదే జోరు కొనసాగిస్తారో లేదో చూడాలంటున్నారు.