ఐడోంట్ కేర్… ఎవరి మాట వినను అన్నది ఈ ఐఏఎస్ స్టైల్.. నేతలు ఊరుకొంటారా!

  • Published By: sreehari ,Published On : July 24, 2020 / 02:09 PM IST
ఐడోంట్ కేర్… ఎవరి మాట వినను అన్నది ఈ ఐఏఎస్ స్టైల్.. నేతలు ఊరుకొంటారా!

Updated On : July 24, 2020 / 2:35 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టర్ సందీప్‌ కుమార్ ఝా ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారరు. ఆ ఐఏఎస్ అధికారి దూకుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ అధికారులకు ఆయన పనితీరుతో కోపం వస్తోందట. ప్రతి విషయంలోనూ అధికారులపై చిర్రుబుర్రులాడుతున్నారట. జిల్లాకు బాస్ తానే కాబట్టి అందరు విధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు.

ఫిబ్రవరిలో జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సందీప్ కుమార్ ఝా.. ప్రభుత్వ అధికారులపై దూకుడు చూపిస్తున్నారు. విధుల్లో అలసత్వం వహిస్తున్న వారిపై బదిలీల వేటు వేశారు. మారుమూల మండలాలలో కూడా ప్రతి ప్రభుత్వ అధికారి హెడ్ క్వార్టర్స్‌లో ఉండాలని ఆదేశించారు. ప్రతి రోజు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ తప్పనిసరి.

ప్రభుత్వం టెండర్లు వేసిన పనులపై సర్వేలు చేస్తూ కాంట్రాక్టర్లకు, వారికి సహకరించే ఇంజనీరింగ్, ఇతర అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల విషయంలో తనకు తెలియకుండా ఎవరికీ బిల్లులు మంజూరు చేయవద్దని సంబధిత శాఖలకు స్పష్టం చేసి ఉలికిపడేలా చేశారట. దాంతో సంవత్సరాల నుంచి వివిధ పనులు చేసి బిల్లుల కోసం ఎదురు చూస్తున్న కాంట్రాక్టర్లు అదే విషయంపై స్థానిక ప్రజాప్రతినిధుల ముందు మొర పెట్టుకున్నా ఫలితం లేకపోయిందంటున్నారు.

ప్రజాప్రతినిధుల రెకమెండేషన్స్ నచ్చదంట :
జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక జడ్పీ చైర్‌పర్సన్ ఉన్నారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ కూడా ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు గానీ, ఇతర ప్రజాప్రతినిధులు ఎవరైనా తమ పనుల కోసం జిల్లా కలెక్టర్ వద్దకు సిఫారసు పంపిస్తే అసలు పట్టించుకోవడం లేదంటున్నారు. ప్రజాప్రతినిధులంటే వారి రెకమెండేషన్స్ అంటే నచ్చదని చెప్పకనే చెబుతుంటున్నారట. ఏదైనా పని కోసం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వచ్చినా వారితో సరిగా మాట్లాడటం లేదని, పైగా ఆయన దృష్టికి తీసుకువచ్చిన ఏ పనైనా పక్కన పెడుతున్నారట. దీంతో ఎమ్మెల్యేలతో పాటు జిల్లాలోని అందరు ప్రజాప్రతినిధులు కలెక్టర్‌పై గుర్రుగా ఉన్నారట.

జడ్పీ చైర్‌పర్సన్‌ ఎవరు అంటూ ఆగ్రహం :
జూన్ 27న జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి అధ్యక్షతన జడ్పీ సీఈఓ వేణుతో పాటు జిల్లాలోని ఎంపీడీఓ, ఎంపిఓలతో ఉపాధి హామీ పనులపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇవ్వలేదట. దానికి తోడు అదే రోజు కలెక్టర్ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌కు జడ్పీ సీఈఓతో పాటు ఎంపీడీవోలు హాజరుకాలేదు. తర్వాత రోజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తనకు తెలియకుండా సమీక్ష సమావేశాలు నిర్వహించడం ఏంటని, ఇలా సమావేశాలు నిర్వహించడానికి జడ్పీ చైర్‌పర్సన్‌ ఎవరు? జడ్పీ సీఈఓ వేణుతో పాటు ఎంపీడీఓలపై అగ్రహం వ్యక్తం చేసారట. కలెక్టర్ వైఖరితో వెంటనే జడ్పీ సీఈఓ వేణు సెలవు పెట్టారు. జిల్లాలోని ఎంపిడిఓలు, ఏంపిఓలు కూడా ఆయనకు మద్దతుగా మూకుమ్మడిగా సెలవుల్లోకి వెళ్ళారు.

కలెక్టర్‌కు అధికారులకు వివాదం ముదురుతున్న నేపథ్యంలో జూలై 1న హరితహారం కార్యక్రమానికి జిల్లాకు వచ్చారు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి. అధికారులతో మంతనాలు జరిపారు. అనంతరం జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మితో పాటు ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్పలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కూడా పర్సనల్‌గా చర్చలు జరిపారు. తర్వాత అధికారుల మధ్య సయోధ్య కుదిర్చాక విధులకు హాజరవుతున్నారు. ఈనెల 15న జడ్పీ సర్వసభ్య సమావేశానికి ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరైనా కలెక్టర్‌ ఝాతో పాటు ముఖ్య అధికారులు మాత్రం రాలేదు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులంతా సమావేశం నుంచి వెళ్లిపోయారు. తాజాగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిని కలసిన జిల్లా అటవీ అధికారులు.. తమను కలెక్టర్‌ వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారట. ఇప్పుడు ఈ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందోనని అంతా ఎదురు చూస్తున్నారు.