ఎనీ టైమ్…ఎనీ ప్లేస్… చంద్రబాబుకు మోహన్ బాబు సవాల్

తిరుపతి: ఏపీలో ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదం మరింత ముదురుతోంది. ఎన్నికల ముందు… ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలంటూ రెండ్రోజుల క్రితం మోహన్‌బాబు నిరసనకు దిగడంతో ఈ ఇష్యూ పొలిటికల్ హీట్‌ను రాజేసింది. దీనిపై అటు టీడీపీ నేతలు, ఇటు మంచు ఫ్యామిలీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బకాయిల విషయంలో మోహన్‌బాబు రాజకీయాలు చేస్తున్నారంటూ ఇప్పటికే కుటుంబరావు, శివాజీ విమర్శించగా.. టీడీపీ నేత బుద్ధా వెంకన్న కూడా కలెక్షన్ కింగ్ వైఖరిని తప్పుబట్టారు. అయితే.. వీరి వ్యాఖ్యలకు మంచు మనోజ్ నిన్న కౌంటర్ ఇవ్వగా… తాజాగా ఈ అంశంపై చంద్రబాబును టార్గెట్ చేస్తూ మోహన్‌బాబు ట్విట్టర్‌లో బహిరంగ లేఖను పోస్టు చేశారు.
లేఖలో చంద్రబాబు పేరును ప్రస్తావించకుండానే మోహన్‌బాబు తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అడిగితే కక్షసాధింపు మొదలుపెట్టారని.. ఆ అబద్ధాల కోరు గురించి చెప్పాలంటే ఒక గ్రంథం తయారవుతుందని ఆరోపించారు. ప్రశ్నించిన వారిని తన తాబేదార్లతో తిట్టిస్తున్నాడని విమర్శించిన మోహన్‌బాబు… వాళ్లెవరూ వద్దు.. నువ్వేరా…నీ మోచీతి నీళ్లు తాగేవాళ్లు కాదు.. నువ్వు నేనే. ఎనీటైమ్, ఎనీ ప్లేస్, ఎనీ వేర్ చర్చకు సిద్ధం. అంటూ సవాల్ విసిరారు. ఇంకా ఓ అడుగు ముందుకేసి… నా స్థాయికి నీవు కూడా అర్హుడవు కాదని లేఖలో పేర్కొన్నారు.