NH-16 హైవే దిగ్బంధం : టీడీపీ నేతల ముందస్తు అరెస్ట్
రాజధాని రైతుల ఆందోళనలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. ఇవాళ NH-16 దిగ్బంధంతో కదం తొక్కుతున్నారు. టీడీపీ నాయకులను పోలీసులు ముందుస్తు అరెస్టులు చేశారు.

రాజధాని రైతుల ఆందోళనలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. ఇవాళ NH-16 దిగ్బంధంతో కదం తొక్కుతున్నారు. టీడీపీ నాయకులను పోలీసులు ముందుస్తు అరెస్టులు చేశారు.
రాజధాని రైతుల ఆందోళనలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. మూడు రాజధానులు వద్దు-అమరావతే ముద్దంటూ నినాదాలతో హొరెత్తిస్తున్నారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో ఎక్కడ చూసినా నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. రాజధాని కోసం రైతులు చేపట్టిన ఆందోళన ఇవాళ్టికి 21వ రోజుకు చేరింది. ఆందోళనల్లో భాగంగా ఇవాళ NH-16 దిగ్బంధంతో కదం తొక్కుతున్నారు. ప్రభుత్వం మూడు రాజధానులపై వెనక్కి తగ్గేవరకు తమ ఆందోళనలు విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు.
రాజకీయాలను పక్కనబెట్టి అన్ని పార్టీల నేతలు తమ ఉద్యమానికి మద్దతివ్వాలని అమరావతి పరిరక్షణ సమితి పిలుపునివ్వడంతో రైతుల పోరుకు టీడీపీ మద్దతు ప్రకటించింది. హైవే దిగ్బంధంలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. అయితే… జాతీయ రహదారి దిగ్బంధానికి అనుమతి లేదంటున్న పోలీసులు… ఆందోళనల్లో టీడీపీ కూడా పాల్గొనటుండటంతో అలర్ట్ అయ్యారు. గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, మాజీమంత్రి నక్కా ఆనందబాబుతోపాటు టీడీపీ ఇంఛార్జ్ కోవెలమూడి రవీంద్ర, జనసేన నేత శ్రీనివాస్ యాదవ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.
కృష్ణా జిల్లాలోనూ టీడీపీ నాయకులను ముందుస్తు అరెస్టులు చేశారు పోలీసులు. విజయవాడ, పెనమలూరు నియోజకవర్గాల్లోని నేతలు, కార్యకర్తలను గృహనిర్బంధం చేశారు. పెనమలూరులో మాజీ ఎమ్మెల్యే బోడెప్రసాద్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. చినకాకాని, కృష్ణాయపాలెం, ఎర్రబాలెంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి… గ్రామాల నుంచి ఎవరూ బయటకు రాకుండా ఆంక్షలు విధించారు.
గొల్లపూడిలో మాజీమంత్రి దేవినేని ఉమా, విజయవాడలో బోండా ఉమను గృహ నిర్బంధం చేసిన పోలీసులు… వారి ఇళ్ల చుట్టూ భారీగా మోహరించారు. ఇళ్ల నుంచి వారు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. హైవేల దిగ్బంధనాన్ని ఓ వైపు పోలీసులు అడ్డుకుంటున్నా… మరోవైపు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు రైతులు. మందడం, తుళ్లూరులో మహాధర్నాలు నిర్వహిస్తున్నారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో రైలే దీక్షలు కొనసాగిస్తున్నారు.
ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కృష్ణా, ప్రకాశం, గోదావరి జిల్లాల్లోను ప్రజాసంఘాలు, రాజకీయపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో మృతిచెఓందిన గోపాలరావు కుటుంబసభ్యులను ఇవాళ పలువురు రాజకీయ, ప్రజాసంఘాల నేతలు పరామర్శించనున్నారు.