వైసీపీ ఎన్డీయేలో కలుస్తుందా..? పవన్‌పై రైతుల ప్రశ్నల వర్షం

అమరావతి పర్యటనలో పవన్‌పై రైతులు, స్థానికులు ప్రశ్నల వర్షం కురిపించారు. రాజధానిలోని ఏ ప్రాంతానికి పవన్ వెళ్లినా ముక్కుసూటిగా ప్రశ్నించారు. మహిళలు సైతం గొంతు విప్పారు. అనుమానాలకు జవాబు చెప్పాలంటూ నిలదీశారు. దాదాపుగా పవన్ పర్యటన మొత్తం ప్రశ్నలు-జవాబులు అన్నట్లుగానే సాగింది. రాయపూడి, వెలగపూడి, తుళ్లూరు, మందడం, అనంతవరం సహా రాజధానిలోని పలు ప్రాంతాల్లో జనసేనాని పవన్ పర్యటించారు. పర్యటనలో భాగంగా జనంతో ముఖాముఖి నిర్వహించారు. బీజేపీతో జనసేన జతకట్టిన సందర్భంగా… పవన్‌ను రాజధాని ప్రజలు ప్రశ్నలతో ముంచెత్తారు.
తుళ్లూరు మహిళలు గొంతు విప్పి పవన్‌ను గట్టిగానే ప్రశ్నించారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మూడు రాజధానుల నిర్ణయం వెనుక కేంద్రం హస్తం ఉందని… మోదీ, అమిత్‌షా అంగీకారంతోనే వైసీపీ మూడు రాజధానులకు మొగ్గు చూపిందా…? అని పవన్‌ను ప్రశ్నిస్తున్నారు అమరావతి మహిళలు. అలాగే… వైసీపీ ఎన్డీయేలోకి వెళ్తుందా…? అని సేనానిని అడిగారు. మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి… రాజధానిపై కేంద్రం వైఖరీ ఏంటో చెప్పాలని ముక్కుసూటిగా అడిగారు. తుళ్లూరుతో సహా మరికొన్ని ప్రాంతాల్లో పవన్ పర్యటిస్తున్నప్పుడు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. మూడు రాజధానుల నిర్ణయంపై కేంద్రం వైఖరేంటో చెప్పాలని రాజధాని రైతులు పవన్‌ను క్వశ్చన్ చేశారు.
అమరావతిలోని రైతులు, మహిళలు అడిగిన ప్రశ్నలకు జనసేనాని పవన్ జవాబిచ్చారు. వైసీపీకి బీజేపీకి ఎలాంటి ఒప్పందాలు లేవన్నారు. వైసీసీ ఎన్డీఏలో కలుస్తుందన్న మాట అవాస్తవమన్నారు. కాబట్టి రాజధాని అమరావతి నుంచి ఎక్కడికి వెళ్లే ప్రసక్తే లేదని… రాజధాని విషయంలో మోదీ, అమిత్‌షాను అపార్ధం చేసుకోవద్దని ప్రజలకు సూచించారు. మూడు రాజధానుల నిర్ణయంతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదన్న ఆయన… జై అమరావతి అనలేనని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు ఒకేనన్నారు.
మొత్తంగా… పర్యటనలో ఎదురైన ప్రశ్నలకు పవన్ కూల్‌గా జవాబులిచ్చారు. అమరావతిపై ఫుల్ క్లారిటీతో ఉన్నానన్నారు. రాజధానిని తరలిస్తే జనసేన అస్సలు ఊరుకోదని దేనకికైనా సిద్ధమేనని పవన్ కళ్యాణ్ అన్నారు.