కేసీఆర్ రాజకీయ ఎత్తు గడలకు ఎంతటి నేతలైనా చిత్తు అవ్వాల్సిందే . తనను తిట్టిన వాళ్ళతోనే పొగిడించుకోవటం ఆయనకున్న నైజం.ఆయన రాజకీయ జీవితంలో తనను తిట్టిన వాళ్లనే పార్టీలోకి తీసుకుని వాళ్ళకు పదవులిచ్చి గౌరవించటం కూడా ఆయనకే చెల్లింది.
వ్యతిరేకించిన వారితోనే పొగిడించుకోవడం ఆయన నైజం…… సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఎంతో మంది నేతలు తన సిద్ధాంతాలను వ్యతిరేకించినా…తిరిగి వారిని ఒప్పించి దగ్గరకి చేర్చుకోవడం ఆయన రాజకీయ నీతి. రాజకీయ ప్రస్థానం మొదలైన నాటి నుంచి ఉద్యమ ప్రస్థానం పూర్తయ్యే వరకు ఎంతో మంది నేతలు ఆ నేతను వ్యతిరేకించినా….తిరిగి ఆ నేత దగ్గరికి చేర్చుకోవడం లో ఆయనకు ఆయనే సాటి. ఇలాంటి ఉదహరణలు చెప్పుకోవచ్చు. ఆ నేత ఎవరో ఇప్పటికే అంచనా వేయవచ్చు…లేదంటే మేమే మీకు చెబుతాం….
సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఎన్నో పదవులు అనుభవించిన ముఖ్యమంత్రి కేసిఆర్…. తెలంగాణా ఉద్యమ సమయంలో అనేక ఆటు పోట్లను ఎదుర్కొన్నారు. సమైక్య పాలనలో జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ…ఆయన చేసిన పోరాటాన్ని తెలంగాణా ప్రాంత నేతలు ఎంతో మంది తప్పు బట్టారు. నేరుగా ఆ ఉద్యమ నేతపైనే తిరుగుబాటు చేసినంత పని చేశారు. పార్టీ పరంగా, వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ కేసిఆర్ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే యత్నం చేశారు. కాలక్రమంలో కేసిఆర్ నమ్మిన సిద్ధాంతాన్నే విమర్శించిన నేతలు సమర్ధించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావానికి ముందు సిద్దిపేట నుంచి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు టిడిపితో పాటు ఆయన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఆయనపై ప్రస్తుతం పార్టీలో ఉన్న మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు. ఆనంతర పరిణామాలతో మారెడ్డి కారెక్కి కేసిఆర్ కు సన్నిహితంగా మారారు. తాజాగా ఆయనకి పౌరసరఫరాల శాఖ చైర్మన్ పదవిని కేసిఆర్ కట్టబెట్టారు. ఇదే కోవలో ఎంతోమంది సీనియర్ నేతలు ఉన్నారు.మెదక్ జిల్లాకు చెందిన మాజీమంత్రి ముత్యంరెడ్డి కేసిఆర్ ను ఉద్యమ సమయం నుంచి వ్యతిరేకిస్తూ వచ్చినా…… ఇటీవలే గూలాబి గూటికి చేరుకున్నారు. రాష్ట్ర రాజకీయాలను ఒకసారి పరిశీలించినట్లయితే ప్రస్తుతం టిఆర్ ఎస్ పార్టీలో కొనసాగుతున్న కొందరు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు గతంలో కేసిఆర్ ను తీవ్ర స్థాయిలో విమర్శించిన వారే. వారంతా గూలాబి గూటికి చేరుకుని కేసిఆర్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఉద్యమ సమయంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్, మైనంపల్లి హన్మంత రావ్ లాంటి నేతలు కేసిఆర్ వ్యవహారంపై ఒంటికాలుపై లేచి నిలబడే వారుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావ్ కూడా ఇదే జాబితాలో నేతగా మనం చెప్పుకోవచ్చు. వరంగల్ జిల్లాకు చెందిన కొండా దంపతులు ఉద్యమ సమయంలో టిఆర్ ఎస్ అధినేతపై తీవ్రంగా విరుచుకుపడ్డా…. గులాబి పార్టీలో చేరి పదవులు అనుభవించారు. ఇటీవల ఎన్నికలకు ముందు కొండా దంపతులు గులాబి పార్టీకి గుడ్ బై చెప్పారు.
తాజాగా గజ్వేల్ లో రెండుసార్లు ముఖ్యమంత్రి కేసిఆర్ పై పోటీ చేసిన ఒంటేరు ప్రతాప్ రెడ్డికి అధికారపార్టీ గాలం వేసింది. ఒంటేరుతో చర్చలు జరిపి కారెక్కించుకునేందుకు సిద్ధమైంది. ఎటువంటి అవాంతరాలు లేకుండా అన్నీ అనుకున్నట్లు జరిగితే శుక్రవారం సాయంత్రం ఒంటేరు కారెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.