ప్రత్తిపాడులో పరేషాన్‌ : స్థానిక నేతలే ముద్దు అంటున్న తెలుగు తమ్ముళ్లు

  • Published By: madhu ,Published On : March 6, 2019 / 02:09 PM IST
ప్రత్తిపాడులో పరేషాన్‌ : స్థానిక నేతలే ముద్దు అంటున్న తెలుగు తమ్ముళ్లు

Updated On : March 6, 2019 / 2:09 PM IST

ఐఏఎస్, ఐపీఎస్‌లు వద్దు.. స్థానిక నేతలే ముద్దు అంటున్నారు ప్రత్తిపాడు తెలుగు తమ్ముళ్లు. వారు పార్టీని సక్రమంగా నడపలేకపోవడంతోపాటు కార్యకర్తలను కలుపుకొని పోవడం లేదంటున్నారు. తమపై పెత్తనానికి మాత్రం ముందుంటున్నారని విరుచుకుపడుతున్నారు. అందుకే.. ఇస్తేగిస్తే లోకల్స్‌కే ఇవ్వండి లేదంటే.. ఖచ్చితంగా ఓడించి తీరుతామని హెచ్చరిస్తున్నారు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అధికార పార్టీ నేతలు.

ఆవిర్భావం నుంచి ప్రత్తిపాడు నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉంది. 1983 నుంచి వరుసగా ఐదు ఎన్నికల్లో మాకినేని పెదరత్తయ్య విజయం సాధించారు. 2004లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి రావి వెంకటరమణ గెలిచారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనతో ప్రత్తిపాడు ఎస్సీలకు రిజర్వ్ అయింది. 2009లో మేకతోటి సుచరిత గెలిచారు. అనంతరం ఆమె వైసీపీలో చేరి తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో కూడా విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో మాత్రం ఇక్కడ టీడీపీ మరోసారి విజయదుందుభి మోగించింది. ఆ పార్టీ నుంచి రావెల కిషోర్ బాబు గెలుపొందారు. రావెల కిషోర్‌బాబు, స్థానిక నాయకుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ప్రత్తిపాడు, వట్టి చెరుకూరు, గుంటూరు రూరల్ మండలంలోని నాయకులు రావెలను వ్యతిరేకించడం మొదలుపెట్టారు. మంత్రి పదవిలో ఉండగా ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా స్థానిక నాయకత్వంతో కలిసి పని చేయలేకపోయారు. అదే సమయంలో పార్టీ అధిష్టానం సైతం ఆయన్ని మంత్రి పదవి నుంచి తొలగించింది. గతేడాది రావెల టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు.

జనసేనలో చేరిన రావెల ప్రత్తిపాడులో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. వైసీపీ తరపున మేకతోట సుచరిత ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గత ఐదేళ్లలో పార్టీ భ్రష్టుపట్టిందని ఇప్పటికైనా కళ్లు తెరిచి తమ గోడు వినాలంటున్నారు. గుంటూరు జిల్లాలో కలెక్టర్‌గా పనిచేసి ప్రస్తుతం రిటైర్డ్ దశలో ఉన్న ఓ ఐఏఎస్ అధికారి ప్రత్తిపాడు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో కార్యకర్తల్లో అసహనం మరింత ఎక్కువైంది. తమతో కలిసి పనిచేసే లోకల్ లీడర్లకు, సమర్థవంతమైన వారికి టికెట్ ఇస్తే తిరిగి గెలిపించుకుంటామంటున్నారు. మరి స్థానిక నాయకుల గోడు అధిష్టానం పట్టించుకుంటుందా..? లేదా తమ బాణీలోనే వెలుతుందా..? అన్నది వేచిచూడాలి.