వైసీపీలోకి PVP : విజయవాడ లోక్ సభ కు పోటీ

  • Publish Date - March 12, 2019 / 07:03 AM IST

షెడ్యూల్ రాకతో ఏపీ పాలిటిక్స్ టర్న్ అవుతున్నాయి. ఆయా పార్టీల్లో చేరికలు – రాజీనామాలతో హీట్ ఎక్కింది. ఎవరికి వారు వ్యూహాలకు పదును పెడుతున్నారు. అభ్యర్థుల ఎంపికకు సమయం లేకపోవటంతో.. కసరత్తులు ముమ్మరం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు పెరిగాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త, నిర్మాత అయిన పొట్లూరి వర ప్రసాద్ అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. జగన్ సమక్షంలో తీర్ధం తీసుకుంటున్నారు. బెజవాడ లోక్ సభ సీటు కన్ఫామ్ అయిన తర్వాతే వైసీపీలో జాయిన్ అవుతున్నట్లు సమాచారం. మార్చి 23న నామినేషన్ ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈలోపు ప్రచారం కూడా మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యారంట.

నిన్నటి వరకు  విజయవాడ ఎంపీ అభ్యర్ధిగా దాసరి జై రమేష్  పోటీ చేస్తారనే  ప్రచారం జరిగింది. ఇందుకు తగ్గట్టుగానే ఆయన పార్టీలో కూడా చేరారు. నామినేషన్ కూడా వేసేందుకు  రమేష్ సిద్ధం అంటూ ప్రచారం జరిగింది. పార్టీ కూడా దాసరి అభ్యర్ధిత్వాన్ని ధృవీకరించింది. రాత్రికి రాత్రే దాసరి స్ధానంలో  పొట్లూరి పేరు వచ్చింది. వాస్తవానికి పొట్లూరి గత ఎన్నికల్లోనే ఆయన పోటీ చేసేందుకు  ఆసక్తి చూపించారు. అప్పటికి ఆయన పార్టీలో చేరలేదు. వైసీపీ అధినాయకత్వం ఇప్పటికే ఆయనతో  చర్చలు జరుపుతోంది.

ఏపీ రాజధాని విజయవాడ ఎంపీ సీటును గెలిచి తీరాలనే పట్టుదలతో పార్టీ వ్యూహాన్ని మార్చుకుంటూ వెళుతుంది. గెలుపు గుర్రాల కోసం, బలమైన అభ్యర్ధుల కోసం చూస్తోంది. అందులో భాగంగానే ఈ మార్పు జరిగినట్లు తెలుస్తోంది. మార్చి 13వ తేదీ బుధవారం ఆయన లోటస్ పాండ్ లో జగన్ సమక్షంలో వైసీపీ చేరనున్నారు. అనంతరం విజయవాడలో పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతారు.