రేవంత్ భవిష్యత్‌పై నీలి నీడలు

  • Published By: madhu ,Published On : March 6, 2020 / 12:48 AM IST
రేవంత్ భవిష్యత్‌పై నీలి నీడలు

Updated On : March 6, 2020 / 12:48 AM IST

ఆయనో ప్రజా ప్రతినిధి. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి అడ్డదారులు తొక్కాడు. భూ బకాసురిడిలా.. కనపడిన ప్రభుత్వ, ప్రైవేటు భూములను స్వాహా చేశాడు. ఆ పాపపు పనిలో ప్రభుత్వ ఉద్యోగులను భాగస్వామ్యం చేసి వారి ఉద్యోగాలు పోయేందుకు కారకుడయ్యాడు. టైమ్ బ్యాడ్ అవడంతో.. ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. అయినా ఆయనకు జైలుకెళ్లడం కొత్తేం కాదు. గతంలోనూ ఓటుకు నోటు కేసులో అరెస్టై జైలుకెళ్లొచ్చారు. ఆయనే రేవంత్‌రెడ్డి. 

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. గండిపేటలో కేటీఆర్ లీజుకు తీసుకున్న ఫాం హౌస్‌ను అనుమతి లేకుండా డ్రోన్‌తో చిత్రీకరించిన కేసులో రేవంత్‌రెడ్డికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు రేవంత్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు.  ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన రేవంత్‌రెడ్డి .. నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా వాడడంపై రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడితో పాటు మొత్తం తొమ్మిది మందిపై కేసు నమోదైంది.

ఐపీసీ 188, 287, 109, 120(బి) సెక్షన్లతో పాటు ఎయిర్‌ క్రాఫ్ట్‌ యాక్ట్ 11(ఎ) రెడ్‌ విత్‌ 5ఏ కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో రేవంత్‌ రెడ్డిని ఏ1గా పేర్కొన్నారు. నార్సింగి స్టేషన్‌కు వచ్చిన రేవంత్‌రెడ్డిని ప్రశ్నించిన పోలీసులు.. ఆ తరువాత గోల్కొండ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం ఉప్పర్‌పల్లి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా.. న్యాయమూర్తి 14రోజుల రిమాండ్ విధించారు. 

రేవంత్‌రెడ్డి జైలు కెళ్లడం కొత్తేం కాదు. ఐదేళ్ల క్రితం తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులోనూ ప్రధాన నిందితుడుగా కటకటాల వెనక్కి వెళ్లారు. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌ ఓటును కొనేందుకు రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్‌ రెడ్డి కెమెరాకు చిక్కారు. ఈ కేసులో 2015 మే31న రేవంత్‌ నుంచి రూ.50లక్షలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి చర్లపల్లికి తరలించారు. 30రోజుల పాటు చర్లపల్లి జైల్లో రేవంత్‌రెడ్డి ఉన్నారు. ఆ తరువాత బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ కేసులో ఇప్పటికీ కోర్టుల చుట్టూ రేవంత్ తిరుగుతున్నారు. ఈనెల 3న ఏసీబీ కోర్టులో హాజరయ్యారు. ఈనెల 17న మరోసారి కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. 

రేవంత్‌ రెడ్డిపై అనేక భూ ఆక్రమణల ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ పరిధిలోని గోపన్‌పల్లిలో రేవంత్‌రెడ్డి కబ్జాల బాగోతం బయటపడింది. రెవెన్యూ శాఖలోని కొందరు అధికారులను లోబర్చుకుని పహణిల్లో అడ్డగోలుగా పేర్లు మార్చారు. రంగారెడ్డి జిల్లా గోపన్‌పల్లిలో వందల కోట్ల విలువైన భూముల్ని కొట్టేశారు. రేవంత్‌ ఆక్రమణల పర్వంపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు పూర్తిస్థాయి నివేదిక సమర్పించారు ఆర్డీవో చంద్రకళ. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో వందల కోట్ల విలువైన భూముల్ని రేవంత్‌ బ్రదర్స్‌ ఆక్రమించినట్లు తేల్చారు. పహణీల్లో అడ్డదిడ్డంగా మార్పులు చేసినట్లు కూడా రెవెన్యూ అధికారుల దర్యాప్తులో వెల్లడయ్యింది.

రేవంత్‌ సోదరులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు నివేదించారు. మరోవైపు కోమటిచెరువులోనూ రేవంత్‌ పాగా వేశారు. వాల్టా నిబంధనలకు విరుద్ధంగా చెరువు భూములను కబ్జా చేసినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. కోమటిచెరువు శిఖం భూమిలోనే కాంపౌండ్‌ వాల్‌ నిర్మించినట్లు తేల్చారు. సర్వే 127లో బండ్లబాటనూ ఆక్రమించినట్లు నివేదికలో పేర్కొన్నారు. సర్వే నెంబర్‌ 128, 160లకు చెందిన 10 గుంటల భూమిని కూడా రేవంత్‌ సోదరులు కబ్జా చేసినట్లు ఆర్డీవో గుర్తించారు. సర్వే నెంబర్ 127లోనూ ఐదెకరాల 21 గుంటలు కూడా టైటిల్ ఫేక్ అని ఆర్డీవో విచారణలో తేలింది.

గోపన్‌పల్లి భూముల విషయంలో రేవంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి, కొండల్‌రెడ్డిపై పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇప్పటికే రేవంత్‌రెడ్డి సోదరులపై ఈ భూములకు సంబంధించి 7 కేసులు నమోదైనట్లు నివేదికలో ప్రస్తావించారు. మొత్తానికి పాత కేసులకు తోడు కొత్త కేసులు రేవంత్ మెడకు చుట్టుకోవడంతో ఆయన భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ కేసుల్లోనూ నేరారోపణ రుజువైతే మరోసారి జైలుకు వెళ్లే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. 

Read More : తెలంగాణ అసెంబ్లీ సభా పర్వం