రాంబాబు నాన్‌లోకల్ : వైసీపీలో అసమ్మతి సెగ

  • Published By: veegamteam ,Published On : January 9, 2019 / 02:39 PM IST
రాంబాబు నాన్‌లోకల్ : వైసీపీలో అసమ్మతి సెగ

ఎన్నికల ముందే ప్రతిపక్ష వైసీపీలో అసంతృప్తుల జ్వాలలు ఎగసిపడుతున్నాయి. అభ్యర్థుల మార్పు వ్యవహారం అనేక నియోజకవర్గాల్లో గ్రూపుల గోలకు తెరలేపింది. తాజాగా సత్తెనపల్లిలో పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు గళం విప్పారు. ఏకంగా రాంబాబుకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించి ఆయనకు టిక్కెట్టు ఇవ్వొద్దంటూ తీర్మానం చేశారు. ఈ వ్యవహారం వైసీపీలో కలకలం రేపుతోంది.

వైసీపీలో సీనియర్ నేతగా ఎదిగిన అంబటి రాంబాబు వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. పార్టీలో కీలక నేతగా ఉన్న రాంబాబుకు వచ్చే ఎన్నికల్లో అసమ్మతి సెగ తప్పేట్టు లేదు. గత ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి స్పీకర్ కోడెల శివ ప్రసాద్ చేతిలో స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. చాలా కాలంగా నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వస్తున్న అంబటి, ఎన్నికల సమీపిస్తుండటంతో ఏడాది కాలంగా పార్టీ కార్యక్రమాల్లో అడపాదడపా పాల్గొంటున్నారు. నాలుగేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ నేతలు, కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చినా రాంబాబు పట్టించుకోలేదన్న అసంతృప్తి కేడర్‌లో ఉంది.

వాస్తవానికి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గానికి లోకల్ కాక పోయినప్పటికీ అధిష్టానం గత ఎన్నికల్లో సత్తెనపల్లి టికెట్టు కేటాయించింది. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో రాంబాబు రేపల్లె నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. 94, 99 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. అప్పట్నుండి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటూ వస్తున్న అంబటికి.. వైఎస్ సీఎం అయ్యాక ఏపీఐఐసీ ఛైర్మన్‌ పదవి కట్టబెట్టారు. అలా వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు. వైఎస్ మరణం తర్వాత జగన్ సొంత పార్టీ ఏర్పాటు చేసిన సమయంలోనూ రాంబాబు అన్నీ తానై క్రియాశీలకంగా వ్యవహరించారు.

ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటిపై వ్యతిరేకత తీవ్రమవుతోంది. సొంత పార్టీకి చెందిన ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు రాంబాబు అభ్యర్థిత్వంపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. నాలుగేళ్లుగా అధికార టీడీపీ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా అంబటి తమను పట్టించుకోలేదన్నది వారి కోపానికి కారణం. ఇలాంటి వ్యక్తి తమకు నాయకుడిగా ఉంటే భవిష్యత్తులో పార్టీని వీడి వెళ్లిపోతానంటూ అధిష్టానానికి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. తాజాగా అసమ్మతి నేతలు సత్తెనపల్లిలో భేటీ నిర్వహించి రాంబాబుకు టిక్కెట్ ఇవ్వొద్దంటూ తీర్మానం చేశారు.

ఇదిలా ఉంటే సత్తెనపల్లి నియోజకవర్గంపై పలువురు వైసీపీ నేతల కన్ను పడింది. స్థానికంగా నలంద విద్యా సంస్థలు అధినేత హరిప్రసాద్‌రెడ్డి తన సతీమణి శారదారెడ్డిని సత్తెనపల్లి నుండి పోటీ చేయించాలని గత ఎన్నికల్లోనే ప్రయత్నించారు. కాని ఫలిచలేదు. ప్రస్తుతం అంబటిపై అసమ్మతి నేపథ్యంలో తిరిగి సత్తెనపల్లి టికెట్ కోసం హరిప్రసాద్‌రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఈసారి సత్తెనపల్లి నుండి పోటీ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మంగళగిరి వైసీపీ సీటును ఈసారి చేనేత వర్గాలకు కేటాయించి, సత్తెనపల్లెను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే సత్తెనపల్లి టిక్కెట్ ఆళ్ళకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే అంబటిని పార్టీ అధినేత ఏ విధంగా బుజ్జగిస్తారో చూడాలి. అటు.. అంబటి అభ్యర్థిత్వం మార్చని పక్షంలో సొంతపార్టీ నేతలే ఆయన్ను ఓడించేందుకు రెడీ అవుతుండడం పార్టీలో కలకలం రేపుతోంది.