మార్చి 15 వరకు కాపాడుకోండి : ఓటర్లకు చంద్రబాబు హెచ్చరిక

  • Published By: veegamteam ,Published On : March 11, 2019 / 04:22 PM IST
మార్చి 15 వరకు కాపాడుకోండి : ఓటర్లకు చంద్రబాబు హెచ్చరిక

అమరావతి: మార్చి 15వరకు ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని, ఓటుని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. దేశంలోని బందిపోటు దొంగలంతా ఏపీకి వచ్చారని, ఓట్లు తొలగించడానికి కుట్రలు పన్నారని చంద్రబాబు ఆరోపించారు. ఓటుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళీకృష్ణ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.

వైసీపీ అధినేత జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ లపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. టీడీపీ డేటాపై కేసీఆర్ కు అంత శ్రద్ధ ఎందుకు? అని ప్రశ్నించారు. కేసీఆర్ నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని అన్నారని మండిపడిన చంద్రబాబు.. కేసీఆర్ కు 100 రిటర్న్ గిఫ్ట్ లు ఇచ్చే శక్తి తనకుందని చెప్పారు. ఏపీపై కేసీఆర్ దౌర్జన్యం చేయాలనుకుంటే కుదరదని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆదాయం వస్తుందంటే అది నా కష్టార్జితం అని చంద్రబాబు అన్నారు.

సీఎం అయిపోవాలనే కోరిక తప్ప సేవ చేయాలనే దృక్పథం జగన్ కు లేదని విమర్శించారు. జగన్ ఎవరినీ నమ్మడని, ఆఖరికి తన నీడను కూడా నమ్మే పరిస్థితి లేదని చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని మోడీని అడిగితే ఈడీని పంపిస్తారని మండిపడ్డారు. మోడీ, జగన్, కేసీఆర్ కలిసి ఎన్ని కుట్రలు చేసినా నన్నేమీ చేయలేరని చంద్రబాబు చెప్పారు. అందరూ కలిసి మనపై పడ్డారన్న చంద్రబాబు.. ఈ ఎన్నికలు చారిత్రక అవసరం అని.. టీడీపీ గెలుపుపై ఎలాంటి అనుమానాలు లేవని ధీమా వ్యక్తం చేశారు.