కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సోనియా రాజీనామా!

దశాబ్దాలపాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం చరిత్రలో ఎన్నడూలేని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే పార్టీ సీనియర్ల ఒత్తిడి మేరకు పగ్గాలు చేపట్టిన సోనియా గాంధీ కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురాలేకపోయారు. ఈ నేపథ్యంలోనే పార్టీలో అంతర్గత సంక్షోభం ముదిరింది. నాయకత్వలో మార్పులు తీసుకురావల్సిన సమయం ఆసన్నమైందన్న చర్చ తెరపైకి వచ్చింది
తాజాగా,పార్టీ నాయకత్వంలో మార్పుకోరుతూ 23 మంది సీనియర్ నాయకులు సోనియాగాంధీకి లేఖ రాశారు. పార్టీ ప్రస్తుత నాయకత్వాన్ని మార్చడంతోపాటు పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడితో పాటు దూర దృష్టి, క్రియాశీలకంగా ఉండే అధినేత కావాలని పేర్కొన్నారు. పార్టీలో అనిశ్చితి ఏర్పడిందని, యువత విశ్వాసం కోల్పోతున్నదని లేఖలో పేర్కొన్నారు. లేఖ రాసిన వారిలో 5 మంది మాజీ ముఖ్యమంత్రులు, శశి థరూర్ వంటి సీనియర్ నాయకులు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, మాజీ కేంద్రమంత్రులు ఉన్నారు. పార్టీలో పెద్ద మార్పులు చేయడం ద్వారా కాంగ్రెస్‌ను కాపాడుకోవచ్చునని వారు అభిప్రాయపడ్డారు.
కాగా, పార్టీలోని ఎక్కువ మంది నాయకత్వ మార్పు కోరుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ ఆ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో కొత్త అధ్యక్షుడ్ని నిర్ణయించాలని పార్టీ సీనియర్లను ఆమె కోరినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో సోమవారం జరుగనున్న ఆన్‌లైన్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఈ అంశంపైనే ప్రధానంగా చర్చ జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఆదివారమే పార్టీ అధ్యక్ష పదవి నుంచి సోనియా వైదొలిగినట్లు తెలుస్తోంది. అయితే సోమవారం జరుగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆమె రాజీనామాను అధికారికంగా ప్రకటిస్తారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒకవేళ అధ్యక్ష పదవికి సోనియా రాజీనామా చేస్తే మరోసారి రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగిస్తారా లేక కొత్త నేతను ఎన్నుకుంటారా అనేది జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.