వైజాగ్‌లో మోడీ: జాతికి అంకితమిస్తున్న చమురు నిల్వలు, ఎందుకంటే..

కేంద్ర రాజకీయాలు రాష్ట్రంలోకి జోరుగా వీస్తున్నాయి. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్ష పేరిట ఢిల్లీలో టెంట్ వేస్తే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గుంటూరు, విశాఖపట్టణం కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గుంటూరులో ఏపీకి ఇస్తామని చెప్పిందేంటి.. ఇచ్చిందేంటి అనే విషయాలు చర్చించడానికి వస్తున్న మోడీ.. విశాఖపట్టణంలో మాత్రం స్ట్రాటజిక్ క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ ఫెసిలిటీ(భూగర్భ చమురు నిల్వలు) కార్యక్రమాన్ని ప్రారంభించేందుక వస్తున్నారు. 1.33 ఎమ్ఎమ్‌టి స్టోరేజి సామర్థ్యం ఉన్న ఈ నిల్వలు.. రూ.1125 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌గా డిజైన్ చేశారు. జాతికి అంకితమివ్వబోతున్న చమురు నిల్వలు ఎందుకు.. వాటితో మనకేం ఉపయోగముందో తెలుసుకోవాలనుందా..
వాణిజ్యపరంగానే కాకుండా, అనుకోని ప్రమాదాలు సంభవిస్తే ఎవరిమీద ఆధారపడకుండా మన వనరులనే ఉపయోగించుకుని నిలదొక్కుకునే క్రమంలో ఈ ఏర్పాటు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ఇతర ఇంధనాలకున్న దేశీయ డిమాండ్ దృష్ట్యా దాన్ని అధిగమించేందుకు ఈ నిల్వలు చేపడతారు. సరైన రాతి గుహల ప్రాంతం ఎంచుకుని కృత్రిమంగా భూగర్భ గుహలు ఏర్పాటు చేస్తారు. వాటిని క్రూడ్ ఆయిల్ నిల్వకు అనుకూలంగా తీర్చిదిద్దుతారు. కృత్రిమంగా ఏర్పాటైన ఈ భూగర్భ గుహలు హైడ్రోకార్బన్లను స్టోర్ చేయడానికి అనుకూలమైనవి. వీటిని ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ నిర్వహిస్తోంది.
ఇవి ఎప్పుడు ఆరంభమయ్యాయి:
1990 సమయంలో పశ్చిమాసియా దేశాలు గల్ఫ్ యుద్ధంలో చిక్కుకుపోయి రవాణా వ్యవస్థ దెబ్బతింది. అదే సమయంలో భారత్ అక్కడి నుంచి ముడిచమురును దిగుమతి చేసుకోవడం ఇబ్బందిగా మారింది. దిగుమతులు తగ్గిపోవడంతో ఇందన ధరలు విపరీతంగా పెరిగాయి. భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు క్షీణించి పరిస్థితికి చేరిపోయింది. కేవలం మూడు వారాల చెల్లింపులకు సరిపోయే విదేశీ మారక ద్రవ్య నిల్వలు మాత్రమే భారత్ వద్ద ఉన్నాయి. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడటానికి భారత్ ఆర్థిక సంస్కరణలను చేపట్టింది.
దీన్ని అధిగమించడానికి 1998లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ చమురు నిల్వ చేసే అంశాన్ని ముందుకు తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే దేశంలో పలుచోట్ల భూగర్భ గుహల్లో ముడి చమురును నిల్వ చేయాలని మోడీ ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. విశాఖ పట్టణం, మంగళూరు, పదూర్ ప్రాంతాల్లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయిపోయాయి. వీటితో పాటుగా కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోనూ వీటిని సిద్ధం చేయనున్నారు.