వైసీపీ నేతల ఒత్తిడి వల్లే అధికారుల బదిలీలు : టీడీపీ

అమరావతి : వైసీపీ నేతల ఒత్తిడి వల్లే ఏపీలో అధికారుల బదిలీలు జరిగాయని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా విడుదల చేశారు. ఈసీకి వైసీపీ చేసిన ఫిర్యాదుల కాపీలు, ఈసీ బదిలీల ఆదేశాల కాపీలను మార్చి 27 బుధవారం టీడీపీ నేతలు మీడియాకు విడుదల చేశారు. మార్చి 25న వైసీపీ ఫిర్యాదు చేస్తే.. 26న ఈసీ చర్యలు తీసుకుందని చెప్పారు. డీజీపీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావుతోపాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ఎస్పీలను బదిలీ చేయాలని వైసీపీ కోరిందని టీడీపీ నేతలు తెలిపారు.
ప్రకాశం, చిత్తూరు జిల్లాల ఎస్పీలపై చర్యలకు వైసీపీ డిమాండ్ చేసిందని టీడీపీ నేతలు వెల్లడించారు. అదనపు సీఈఓ సుజాతశర్మను బదిలీ చేయాలని వైసీపీ సూచించిందని చెప్పారు. రిటైర్డ్ ఐపీఎస్ యోగానంద్, లా అండ్ ఆర్డర్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాసులుపైనా చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేసిందని తెలిపారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన విషయాలు బయటికి వస్తాయని బెంబేలెత్తి.. కడప జిల్లా ఎస్పీని బదిలీ చేయించారని టీడీపీ నేతలు ఆరోపించారు.
కక్షపూరితంగా అధికారులను బదిలీ చేస్తున్నారని మండిపడ్డారు. కొంతమందిని, ఒక కులానికి చెందిన అధికారులనే టార్గెట్ చేసుకుని ఎన్నికల విధుల నుంచి బయటికి పంపించాలని కుట్ర రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. లాండ్ ఆండ్ అర్డర్ విషయంలో తమకు అనుమానం ఉందన్నారు. ఇటీవల జగన్ మాట్లాడుతూ రెండు, మూడు హత్యలు కూడా జరుగవచ్చని అన్నారని ఈనేపథ్యంలో ఆయన వైఖరిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ విషయం హైకోర్టు దృష్టికి వెళ్లింది. టీడీపీ నేతలు లంచ్ మోహన్ పిటిషన్ వేశారు. మరికొంతసేపట్లో కోర్టు నిర్ణయం రానుంది.