బస్ డిపోల వద్ద ఉద్రిక్తత : కార్మికుల అరెస్టు

  • Published By: madhu ,Published On : November 16, 2019 / 09:59 AM IST
బస్ డిపోల వద్ద ఉద్రిక్తత : కార్మికుల అరెస్టు

Updated On : November 16, 2019 / 9:59 AM IST

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 43వ రోజుకు చేరుకుంది. 2019, నవంబర్ 16వ తేదీ శనివారం బస్ రోకోకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి పోలీసులు ఫర్మిషన్ ఇవ్వలేదు. డిపోల వద్ద 144 సెక్షన్ విధించారు. అయినా..కూడా కార్మికులు పెద్ద సంఖ్యలో డిపోల వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. కార్మికులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 
ఖమ్మంలో…
ఆర్టీసీ కార్మికులు, వామపక్ష నాయకులు ఖమ్మం డిపో ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. బస్సులను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో కార్మికులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురు కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. 
మహబూబాబాద్‌లో…
బస్‌రోకోలో భాగంగా మహబూబాబాద్‌లోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కార్మికులు, అఖిలపక్ష నాయకులు తెల్లవారుజాము నుంచే బైఠాయించారు. ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం చర్చలకు పిలిచి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అయితే.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. 60మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 
జగిత్యాలలో…
జగిత్యాల జిల్లాలో జేఏసీ ఇచ్చిన బస్‌రోకో పిలుపుతో డిపోల వద్ద కార్మికులు ఆందోళన చేశారు. బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. డిపోల వద్ద 144 సెక్షన్‌ విధించి ధర్నాలు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 
రాజన్న సిరిసిల్లలో…
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ సమ్మె 43వ రోజు కొనసాగుతోంది.. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు ఉదయమే బస్‌ డిపోల ముందు ఆందోళనకు దిగారు. కార్మికులకు మద్దతుగా అఖిలపక్ష నాయకులు పెద్ద ఎత్తున వచ్చి ధర్నా చేశారు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు.. దీంతో ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. 
జోగులాంబ గద్వాల జిల్లాలో…
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల బస్‌స్టాండ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్మికులను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించడంతో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం కార్మికులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉదయం నుండే వివిధ పార్టీలకు చెందిన నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
హైదరాబాద్‌లో…
హైదరాబాద్‌లో పలు డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన బస్‌రోకో పిలుపులో భాగంగా డిపోల ఎదుట బైఠాయించారు. ఓల్డ్‌సిటీలోని ఫరూఖ్‌నగర్‌లో బస్టాండ్‌ ఎదుట పలువురు కార్మికులు బైఠాయించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
Read More : తెలంగాణలో పెరిగిన చలి గాలులు