Durga Devi : అమ్మవార్లకు నిమ్మకాయల హారం వేయటం వెనుక రహస్యం ఇదే..
అమ్మవార్లకు నిమ్మకాయల దండ ఎందుకు వేస్తారు... నిమ్మకాయల దండ వేయటం వెనుక ఉన్న ఆచారం ఏమిటి..? దీని వెనుక ఉన్న కారణం ఏమిటి..?

garlanding the gods with lemons
garlanding the gods with lemons : కనకదుర్గమ్మ, మహిషాసుర మర్దిని,దుర్గాదేవి,ఆది పరాశక్తి ఇలా ఎలా పిలిచినా పలికే అమ్మవార్లు భక్తుల కోరికలు తీర్చే ఇలవేల్పులుగా పూజలందుకుంటున్నారు. నవరాత్రుల వేడుకల్లో రోజు అవతారంగా మారి భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్నారు. అమ్మావారు అంటే ఉగ్రరూపాలే గుర్తుకొస్తాయి. పెద్ద నాలుక, అస్త్రశస్త్రాలు, మెడలో పుర్రెల దండ, నిమ్మకాయల దండతో ఉగ్రరూపంగా కనిపించినా ఆ రూపం వెనుక వెన్నలాంటి అమ్మ మనస్సుతో ఎప్పుడు కరుణ కురిపిస్తునే ఉంటారు. రాక్షసులకు అపరకాళిలా భక్తులకు అమ్మలా కనిపించే అమ్మవార్లు ధరించే నిమ్మకాయల హారం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందాం..
రాక్షస సంహారం చేసిన అమ్మవారిని అమ్మవారిని శాంతింపజేయడానికి భక్తులు..అయిగిరి నందిని నందిత మోదిని అంటూ పాటలు పాడి శాంతింజేస్తారు. అలాగే అమ్మవారిని శాంతపరచి ప్రసన్నం చేసుకోవడానికి ఆమెకు ప్రీతిపాత్రమైన పులుపుతో కూడిన నిమ్మకాయల దండను తల్లికి వేయడం సంప్రదాయంగా వస్తోంది అని పండితులు చెబుతున్నారు.
‘కళావతీ కళారూపా కాంతా కాదంబరీ ప్రియా‘ అంటుంది లలితా సహస్ర నామం. అందుకే ఆమెకు కాదంబరి (మద్యం) వంటి పుల్లని రుచితో ఉండే నిమ్మకాయలను దండగా వేయడం, పులిహోర వంటి పుల్లటి పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం ఆచారంగా మారింది.
కాలక్రమంలో నిమ్మకాయలను దుష్టశక్తుల పీడా నివారణకు బలిగా ఉపయోగించడం మొదలైంది. అమ్మవారి మెడలో నిమ్మకాయల దండను వేయడం వెనుక కారణం ఇదేనని చెబుతున్నారు పండితులు. అలాగే అమ్మవార్లకు పులిసిన పెరుగు అన్నం కూడా నైవేద్యంగా పెడతారు.గ్రామదేవతలకు నైవేద్యం ‘చలి నైవేద్యం’ పెడతారు. అలా అమ్మవార్లకు పులుపుతో ప్రసన్నం చేసుకోవటం ఆచారంగా మారింది.అందుకే అమ్మవార్లకు నిమ్మకాయల్ని దండగా వేస్తారు. కానీ సత్వ రూపిణులైన లక్ష్మీదేవికి గానీ, సరస్వతీ అమ్మవార్లకు మాత్రం ఇది వర్తించదు.