Fake Birth Certificate Case: భార్య, కొడుకుతో కలిసి కోర్టు బయటకు వచ్చిన అజాం ఖాన్.. జైలుకు వెళ్లేముందు ఏం చెప్పారంటే?
కోర్టు విచారణ తర్వాత ఆజాం ఖాన్, ఆయన కుటుంబాన్ని పోలీసు కస్టడీ నుంచి జైలుకు తీసుకువెళుతున్నప్పుడు సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు, అజాం ఖాన్ మద్దతుదారులు జైలు వెలుపల చేరుకుని ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు.

Uttar Pradesh: నకిలీ జనన ధృవీకరణ పత్రం కేసులో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అజాం ఖాన్, ఆయన భార్య తంజీమ్ ఫాతిమా, కుమారుడు అబ్దుల్లా ఆజం ఖాన్‌లకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ కోర్టు(ఎంపీ-ఎమ్మెల్యే) శిక్ష విధించింది. అయితే కోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ఆజాం మాట్లాడుతూ.. ఈరోజు నిర్ణయం తీసుకున్నారని.. నిర్ణయానికి, న్యాయానికి తేడా ఉందని అజాం ఖాన్ అన్నారు.
చాలా చర్చనీయాంశమైన నకిలీ జనన ధృవీకరణ పత్రం కేసులో రాంపూర్ కోర్టు బుధవారం చారిత్రాత్మకమైన తీర్పును ఇస్తూ అజాం ఖాన్, ఆయన భార్య తంజీమ్ ఫాతిమా, కుమారుడు అబ్దుల్లా అజామ్‌లకు ఒక్కొక్కరికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు విచారణ తర్వాత ఆజాం ఖాన్, ఆయన కుటుంబాన్ని పోలీసు కస్టడీ నుంచి జైలుకు తీసుకువెళుతున్నప్పుడు సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు, అజాం ఖాన్ మద్దతుదారులు జైలు వెలుపల చేరుకుని ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. ఆజాం మద్దతుదారులు పోలీసు వాహనాన్ని నలువైపుల నుంచి చుట్టుముట్టారు. అప్పటికే అక్కడ ఉన్న పోలీసు బృందం అతి కష్టం మీద ఆయనను అక్కడి నుంచి తప్పించి జైలుకు తీసుకెళ్లింది.
ఇది కూడా చదవండి: Rahul on Pawar: శరద్ పవార్ ప్రధానమంత్రి కాదు.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు
కాగా, అజాం ఖాన్ కు వేసిన శిక్షపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘ఆజంఖాన్ సాహెబ్‌పై నిరంతరాయంగా దాడులు జరుగుతున్నాయి. పెద్ద కుట్ర వల్లే ఇలా వ్యవహరిస్తున్నారు. బీజేపీ నేతలు, బయటి నుంచి తీసుకొచ్చిన కొందరు అధికారులు ఆయనతో కుట్ర పన్నుతున్నారు. మొదటి రోజు నుంచి అదే జరుగుతోంది’’ అని అన్నారు. ఇంకా స్పందిస్తూ.. ‘‘కొంతమంది స్వార్థపరులు విద్యను ప్రోత్సహించే వ్యక్తులు సమాజంలో చురుకుగా ఉండటానికి ఇష్టపడరు. ఈ రాజకీయ కుట్రకు వ్యతిరేకంగా ఎన్నో న్యాయ ద్వారాలు తెరుచుకున్నాయి. దౌర్జన్యాలకు పాల్పడే వారు గుర్తుంచుకోండి. అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజల కోర్టు కూడా ఉంది’’ అని అఖిలేష్ అన్నారు.