BRS Leaders Migration : కారు పార్టీలో కలకలం.. బీఆర్ఎస్‌‌లో వలసలకు కారణం ఏంటి?

అసెంబ్లీ ఎన్నికలు జరిగి 100 రోజులు కూడా గడవక ముందే పలువురు కీలక నేతలు కారు దిగేస్తుండటాన్ని ఏమనాలి? ఎలా చూడాలి?

Leaders Migration Tension For BRS

BRS Leaders Migration : కారు కంట్రోల్ తప్పుతోందా? ఒక్క ఓటమితో బ్రేక్ డౌన్ అవుతోందా? కారు.. సారు.. అంటూ తడబడుతున్న గులాబీదళం.. పార్లమెంట్ పోరుకు ముందు పరేషాన్ అవుతోందా? అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఇంకా 100 రోజులు కూడా పూర్తి కాకముందే పలువురు కీలక నేతలు కారు దిగేస్తుండటాన్ని ఏమనాలి? ఎలా చూడాలి?

ఇంకా ఎంతమంది వెళ్లిపోతారో..
కారు.. తీరు.. ఏం బాగాలేదు సారూ… అంటున్నారు గులాబీ కార్యకర్తలు.. పడిలేచిన కెరటంలా సత్తా చాటాల్సిన లీడర్లు.. సేఫ్ జోన్‌ వెతుక్కుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఇంకా 100 రోజులు కూడా కాకముందే గులాబీదళం కకావికలం అవుతోంది. తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీల్లో ఇప్పటికే ముగ్గురు పార్టీకి రాం.. రాం.. చెప్పేయగా, ఇంకా ఎంతమంది ఉంటారో, ఎవరెవరు పక్కచూపులు చూస్తారో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారుతారనే ప్రచారంతోపాటు ఇక గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఒక్కొక్కరుగా కారు దిగేస్తుండటం గులాబీ పార్టీని కంగారు పెడుతోంది.

బీఆర్ఎస్ నేతలను తీసుకుని వారినే అభ్యర్థులుగా ప్రకటిస్తున్నాయి..
అసెంబ్లీ ఎన్నికల్లో కుదేలైన కారు పార్టీని నిలకడగా ఉండనీయకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి రెండు జాతీయ పార్టీలు. ఒకవైపు కాంగ్రెస్.. మరోవైపు బీజేపీ దొరికిన వారిని దొరికినట్లు తమతో కలుపుకుంటున్నాయి. స్థానిక రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నవారు కాంగ్రెస్‌తోనూ.. జాతీయ రాజకీయాలు చేద్దామనుకున్న వారు బీజేపీలో చేరేందుకు తహతహలాడుతున్నారు. విచిత్రంగా రెండు పార్టీలకు బీఆర్ఎస్ ఒక్కటే టార్గెట్ గా మారింది. రెండు పార్టీలకు కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులు కొరత పీడిస్తోంది.

ఇలాంటి చోట కారు పార్టీ లీడర్లను తీసుకుని వారినే అభ్యర్థులుగా ప్రకటిస్తుండటం ఇంకా హైలెట్‌గా నిలుస్తోంది. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్‌ కర్నూల్ ఎంపీ రాములు బీజేపీలో చేరిన వెంటనే బంపర్ ఆఫర్ కొట్టేశారు. రాములు కుమారుడు భరత్‌కు నాగర్‌ కర్నూల్ సీటు, బీబీ పాటిల్‌కు సిట్టింగ్ సీటు కట్టబెట్టింది కమలదళం.

వెంటాడుతున్న కేసుల భయం..
అదే విధంగా ఖమ్మం జిల్లాకు చెందిన జలగం వెంకటరావు, నల్లగొండ జిల్లాకు చెందిన సైదిరెడ్డి, ఆదిలాబాద్, మహబూబాబాద్ మాజీ ఎంపీలు జి.నగేశ్, సీతారాం నాయక్‌ వంటి వారికి టికెట్లు ఇచ్చేందుకు రెడీ అవుతోంది కమలం పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 సీట్లే గెలిచినా.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఎక్కడా లేని ఉత్సాహంతో పరుగులు తీస్తోంది కమలదళం. ఇదే సమయంలో బీజేపీ నుంచి ఒత్తిడిని తట్టుకోవడం బీఆర్ఎస్‌కు పెద్ద సవాల్‌గా మారుతోంది. కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉండటం.. కేసుల భయం వల్ల బీజేపీని దీటుగా ఎదుర్కోవడం బీఆర్ఎస్‌ శక్తికి మించిన పనిగా మారింది.

బీఆర్ఎస్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్..
ఇలా బీజేపీ అష్టదిగ్బంధం చేస్తుంటే.. కాంగ్రెస్ కూడా ముప్పేట దాడి చేస్తోంది. ముందుగా బీఆర్ఎస్ నుంచి వలసలను ప్రోత్సహించమన్న కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు మాట మార్చడమే కాకుండా… స్పీడ్ పెంచి కారు పార్టీని ఖాళీ చేసేలా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్‌కు పెద్దగా బలం లేకపోవడంతో ఆయా జిల్లాల పరిధిలో ఎమ్మెల్యేలతో పాటు స్థానిక క్యాడర్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇక గ్రామ, పట్టణ స్థాయిలో సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఇలా చిన్నాచితకా లీడర్లను గులాబీ పార్టీకి దూరం చేస్తూ.. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తూ చాపకింద నీరులా బీఆర్ఎస్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది కాంగ్రెస్ పార్టీ.

వాళ్లు కూడా కాంగ్రెస్ లోకి జంప్..!
ఉమ్మడి రంగారెడ్డికి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి సునీతా మహేందర్‌రెడ్డితోపాటు, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు తీగల అనితారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కూడా హస్తం తీర్థం తీసుకోగా, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి కూడా నేడో రేపో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వంటివారు కాంగ్రెస్‌లో చేరగా, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తారని భావిస్తున్న ఫైళ్ల శేఖర్‌రెడ్డి, గుత్తా అమిత్‌రెడ్డి లాంటి వాళ్లు కూడా కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

అటు మాజీ మంత్రి మల్లారెడ్డి.. ఇటు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ లాంటి వాళ్లు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ప్రచారం సాగగా.. వారిద్దరూ అలాంటి ఆలోచనమీ లేదని ఖండించారు. తమ ప్రయాణం కేసీఆర్‌తోనే అంటూ తేల్చిచెప్పేశారు.

అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్..
గత పదేళ్లలో బీఆర్ఎస్ లో కీలక నేతలుగా చెప్పుకున్న వారు సైతం.. ఏమీ కాదన్నట్లు తెగదెంపులు చేసుకుంటుండటం హీట్‌ పుట్టిస్తోంది. రెండు పార్టీలూ చెరోవైపు నుంచి ఆపరేషన్ చేపడుతుండటం వల్ల బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. పైగా ఒక పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండటం, మరోపార్టీ కేంద్రంలో చక్రం తిప్పుతుండటం వల్ల ఆకర్షితులవుతున్నారు. పదేళ్లుగా అధికారం అనుభవించి.. మూడు నెలల ఉక్కబోతనే తట్టుకోలేకపోతున్నారు గులాబీ నేతలు. భవిష్యత్ భద్రంగా ఉండాలంటే సేఫ్ జోన్ లో చేరడమే మేలన్న ఆలోచనతో మార్పు నిర్ణయానికి వస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

కారు పార్టీ ఖాళీ అవ్వడం ఖాయం..?
గతంలో ఎన్నిక ఏదైనా పోటీ చేయడానికి ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు నలుగురు నేతలు పోటీపడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు పోటీ చేయాల్సిందిగా అగ్రనాయకత్వం నేతలను బతిమిలాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవే పరిస్థితులు మరికొన్నాళ్లు కొనసాగితే కారు పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుందని హెచ్చరిస్తున్నారు పరిశీలకులు.

Also Read : పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి బీఆర్ఎస్ సరికొత్త వ్యూహం.. కారణం అదేనా?

 

 

ట్రెండింగ్ వార్తలు