పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి బీఆర్ఎస్ సరికొత్త వ్యూహం.. కారణం అదేనా?

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలనుకుంటోంది కారు పార్టీ.

పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి బీఆర్ఎస్ సరికొత్త వ్యూహం.. కారణం అదేనా?

BRS Party New Strategy : పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది గులాబీ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో వంద నియోజకవర్గాల్లో ప్రచార సభలు నిర్వహించిన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో సరికొత్తగా క్యాంపెయిన్ చేసేందుకు రెడీ అవుతోంది. భారీ బహిరంగ సభలకంటే రోడ్ షోలు, బస్సు యాత్రలతో ఎక్కువ మంది ప్రజల దగ్గరికి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్.

ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకొని..
పార్లమెంట్ ఎన్నికల్లో సరికొత్తగా ప్రచారం చేయనుంది బీఆర్ఎస్ పార్టీ. బీజేపీ, కాంగ్రెస్ జాతీయ నేతలు అనుసరించే ప్రచార వ్యూహాలకు అనుగుణంగా ప్రచారపర్వాన్ని కొనసాగించాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కీలక నేత హరీశ్ రావులు బహిరంగ సభలతో జోరుగా ప్రచారం చేశారు. అయినా పార్టీ అనుకున్న స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. అధికారంలో లేకపోవడంతో ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకొని.. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలనుకుంటోంది కారు పార్టీ.

అన్ని మతాల ప్రార్థనా మందిరాల సందర్శన..
ఇప్పటికే ఐదు చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది బీఆర్ఎస్. ఆ స్థానాల్లో ప్రచారం ఎలా చేయాలన్న దానిపై మాజీమంత్రి హరీశ్ రావు ప్రత్యేకంగా సమావేశమై నేతలకు పలు సూచనలు చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూనే.. బీజేపీని ఎండగట్టేలా వ్యూహాన్ని అమలు చేయాలని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, హామీలు అమలు కాలేదని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.

ఇదే సమయంలో బీజేపీని టార్గెట్ చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. బీజేపీ అభ్యర్థులను డిఫెన్స్ లో పడేసేందుకు గ్రామాలకు వెళ్లినప్పుడు కచ్చితంగా స్థానికంగా ఉండే దేవాలయాలను అభ్యర్థులు సందర్శించాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అన్ని మతాల ప్రార్థనా మందిరాలను సందర్శించి వారి మద్దతు కూడగట్టేలా వ్యవహరించాలని అభ్యర్థులకు సూచిస్తున్నారు.

బహిరంగ సభలు బదులు బస్సు యాత్రలు, రోడ్ షోలపై దృష్టి..
ఈసారి ఎన్నికల ప్రచారంలో అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా భారీ బహిరంగ సభలు కాకుండా బస్సుయాత్రలు, రోడ్ షోల ద్వారానే ప్రజల దగ్గరికి వెళ్లాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత సహా కీలక నేతలు నిర్వహించే రోడ్ షోలకు 10 నుంచి 15 వేల వరకు జన సమీకరణ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వీలైనంత ఎక్కువ చోట్ల రోడ్ షోలు నిర్వహిస్తే.. అన్ని ప్రాంతాలను కవర్ చేయొచ్చని అనుకుంటున్నారు.

అందుకే బహిరంగ సభలను వీలైనంత వరకు తగ్గించి.. బస్సుయాత్రలు, రోడ్ షోల ద్వారానే ప్రచారంపై ఎక్కువగా ఫోకస్ పెట్టనున్నారు. నాలుగు పార్లమెంట్ సెగ్మెంట్లకు ఒక్క బహిరంగసభ నిర్వహించాలన్న యోచనలో పార్టీ ఉంది. క్యాండిడేట్లు ఖరారైన పార్లమెంట్ నియోజకవర్గాల్లో.. మండల స్థాయిలో కార్యకర్తల సమావేశాలను వెంటనే మొదలు పెట్టాలని అభ్యర్థులను ఆదేశించింది పార్టీ.

Also Read : భట్టి విక్రమార్కకు జరిగిన అవమానంపై మల్లికార్జున్ ఖర్గే స్పందించాలి : బాల్క సుమన్