జగన్ ట్వీట్: భుజాలపై మోసిన అందరికీ వందనాలు

  • Published By: vamsi ,Published On : March 12, 2019 / 05:30 AM IST
జగన్ ట్వీట్: భుజాలపై మోసిన అందరికీ వందనాలు

Updated On : March 12, 2019 / 5:30 AM IST

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిదేళ్ల ప్రస్థానంపై ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. 12 మార్చి 2011న స్థాపించబడిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP)ని వైఎస్సార్ ఆశయ సాధన కోసమంటూ జగన్ స్థాపించారు. ఇడుపులపాయలో YSR పాదాలచెంత వైఎస్ జగన్ తన తల్లి విజయమ్మతో కలిసి పార్టీని ప్రకటించారు. పార్టీ ఆవిర్భవించిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా.. 2014 ఎన్నికల్లో 67 అసెంబ్లీ స్థానాలు, 9లోక్‌సభ స్థానాలను దక్కించుకుని అతిపెద్ద పార్టీలలో ఒకటిగా మారి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. ఉమ్మడి ఆంధ్రరాష్ట్ర విభజన తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికలలో దేశంలోని మొత్తం ప్రాంతీయ పార్టీల్లో ఒంటరిగా అధిక ఓట్లను దక్కించుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా కీలక పాత్ర పోషించింది. 
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా అధినేత జగన్ భావోద్వేగంతో ట్వీట్ చేశారు.‘మహానేత ఆశయాలను, పథకాలను సజీవంగా ఉంచేందుకు వైయస్సార్ కాంగ్రెస్ ఆవిర్భవించి నేటికి తొమ్మిదేళ్లు. గత ఎనిమిదేళ్లుగా ప్రజా జీవితంలో సవాళ్లు, కష్టాలు, నష్టాలకు ఎదురొడ్డి ఈ పార్టీని భుజస్కందాలమీద మోసిన ప్రతి కుటుంబ సభ్యుడికి శుభాకాంక్షలు, వందనాలు’ అని అందులో పేర్కొన్నారు.

2014లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన వైసీపీ.. 2019 ఎన్నికల్లో గెలుపుధీమాతో ఉంది. పాదయాత్ర చేసి రాష్ట్రమంతా తిరిగిన జగన్.. నవరత్నాల పేరుతో పథకాలను ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ కూడా రావడంతో సమరశంఖారావం పూరించారు.