విశాఖ మేయర్ పీఠం వైసీపీదే…. పక్కాగా పావులు కదుపుతున్న విజయసాయి రెడ్డి 

  • Published By: chvmurthy ,Published On : March 11, 2020 / 06:58 AM IST
విశాఖ మేయర్ పీఠం వైసీపీదే…. పక్కాగా పావులు కదుపుతున్న విజయసాయి రెడ్డి 

Updated On : March 11, 2020 / 6:58 AM IST

విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోటానికి వైసీపీ యత్నాలు ముమ్మరం చేసింది. గ్రేటర్ విశాఖ ఎన్నికలు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ రాజధాని చుట్టూ తిరుగుతున్నాయి. రాజధాని అభివృధ్ది అంశంపై వైసీపీ ఫోకస్ చేస్తుంటే…వైసీపీ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతిపక్ష టీడీపీ యత్నిస్తోంది. వైసీపీ కి గతంలో ఇక్కడ తగిలిన ఎదురు దెబ్బలు దృష్టిలో పెట్టుకుని వైసీపీ కార్పోరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా  తీసుకుంది. నగరంలోని 98 వార్డుల్లో అభ్యర్ధుల విజయం కోసం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తన వ్యూహాలను అమలు చేస్తున్నారు. (స్థానిక సంస్థల్లో క్లీన్ స్వీప్ చేయాల్సిందే.. తేడా వస్తే టికెట్ ఉండదు!)

ఎట్టి పరిస్ధితుల్లోనూ విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని సీఎం జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీఎంజగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు ప్రజలు మద్దతు ఉందని నిరూపించటానికి ఈ ఎన్నికలు మంచి అవకాశంగా తీసుకుని  గెలుపుకోసం వైసీపీ కృషి చేస్తోంది. ఒక విధంగా విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గ్రేటర్  ఎన్నికల రెఫరెండంగా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. 

సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర మంతా వైసీపీ హవా కొనసాగితే  విశాఖనగరంలో మాత్రం టీడీపీ పాగా వేసింది. విశాఖలోని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ నియోజకవర్గాల్లో నలుదిక్కులా టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. అలాగే 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎంపీ స్ధానానికి పోటీ చేసిన వైఎస్ విజయమ్మ బీజేపీ అభ్యర్ధి హరిబాబు చేతిలో పరాజయం పొందారు. ఈ వైఫల్యాలను  దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ విశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారు.  రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్రకు ప్రత్యేక పరిశీలకునిగా జగన్మోహన్ రెడ్డి నియమించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా విశాఖపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. 

తొమ్మిది నెలల వ్యవధిలో విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు  సీఎం జగన్. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్ చేస్తున్నట్లు ప్రకటించారు. విశాఖ మహానగర అభివృద్ధి కోసం వెయ్యి కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి స్వయంగా శంకుస్థాపనలు చేశారు. విశాఖలో 140 కిలో మీటర్ల మేర పొడువున మెట్రో రైల్ ప్రాజెక్టు పనులకు అడుగులు వడి వడిగా పడుతున్నాయి. జిల్లాలో లక్ష యాభై వేల మందికి ఇళ్ల పట్టాలు, మరో 25వేల మందికి టిడ్కో కింద ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.  ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఇళ్లపంపిణీ తాత్కాలికంగా వాయిదా పడింది.  

మేయర్ అభ్యర్ధిని  ఎన్నికల అనంతరం ఎంపిక చేయనున్నారు.నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలను నిర్వహించడంతో పాటు, గెలిచే అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను ఇన్ చార్జిలకు అప్పగించింది. పార్టీ హైకమాండ్ ఇప్పటికే గ్రౌండ్ లెవల్ లో సర్వేలు నిర్వహించింది. అభ్యర్ధులు ట్రాక్ రికార్డ్ ఆధారంగా స్క్రీనింగ్ కమిటీలకు వివరాలుఅందిస్తోంది.అవసరం అయితే బయటి నుండి అభ్యర్థులను తీసుకోవడానికి కూడా మరో సర్వే జరుగుతోంది. జిల్లా ఇన్ చార్జి మంత్రి కురసాల కన్నబాబు, మంత్రి అవంతి శ్రీనివాస్ లు  జీవీఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని టీడీపీ వ్యూహాలకు చెక్ పెట్టేందుకు కృషి చేస్తున్నారు. 

మరోవైపు విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించటంతో టీడీపీలోని ఒక్కో నాయకుడు వైసీపీ లోకి చేరుతున్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికల వేళ అది మరింత ఊపందుకుంది. వీరేకాక జనసేన పార్టీనాయకులు  కూడా వైసీపీలోకి క్యూ కట్టారు. ఇప్పటికే విశాఖపట్టణానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఏ రెహమాన్. జనసేన కు చెందిన మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు లు  వైసీపీలో చేరగా తాజాగా మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో యలమంచిలి నుంచి పంచకర్ల పోటీ చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో పంచకర్ల రమేష్ బాబు వరుసుగా మంతనాలు జరిపినట్లు సమాచారం. మరికొందర నేతులు కూడా టీడీపీ వీడేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. 

See More:

*  టీడీపీకి వరుస షాక్ లు…వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే పంచకర్ల

అందుకే రాజీనామా చేశా : మాజీ ఎమ్మెల్యే పంచకర్ల