రాజ్యసభ అభ్యర్ధులు ఖరారు

ఉన్న ఖాళీలు నాలుగు.. అందులో ఒకటి కేంద్రంలోని బీజేపీ తరఫున అంబానీ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక మిగిలినవి మూడు.. వాటికోసం బోలెడు పేర్లు. ఎవరికిస్తే ఏమవుతుందోనన్న ఆందోళన.. అయినా రకరకాల కూడికలూ, తీసివేతలు లెక్కలేసిన తర్వాత ఆ మూడింట్లో ఇద్దరినీ ఫిక్సింగ్ చేసేశారు. ఇక మిగిలింది ఒక్కటే.. ఆ ఒక్కటీ ఇంటి అవసరాల కోసం ఉంచుతారా? బడుగు వర్గాలలో నిఖార్సయిన క్యాండిడేట్ దొరికితే ఇచ్చేస్తారా? చూద్దాం..ఎవరికిస్తారో..
త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ తన అభ్యర్థుల విషయంలో తుది నిర్ణయానికి వచ్చేసిందంట. రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నాలుగు సీట్లు కూడా వైసీపీకే దక్కుతాయి. తమ పార్టీకి దక్కే నాలుగు సీట్లను ఎవరికి కేటాయించాలనే దానిపై ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తుది నిర్ణయానికి వచ్చేశారనే ప్రచారం మొదలైంది. పార్టీ శ్రేణుల ద్వారా అందిన సమాచారం ప్రకారం ఒక సీటు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోదరుడు అయోధ్యరామిరెడ్డికి దక్కుతుందంటున్నారు. ఆయన 2014 ఎన్నికల్లో నర్సరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో మాత్రం ఆయనకు టికెట్ ఇవ్వలేదు.
మొదటి నుంచి వైసీపీకి గట్టి మద్దతుదారైన అయోధ్యరామిరెడ్డికి రాజ్యసభ సీటు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారట. అంతే కాకుండా ఆయన సోదరుడు ఆర్కేకు మంత్రి పదవి ఇస్తామని, ఇవ్వలేకపోయినందున ఇప్పుడు రాజ్యసభ సీటిచ్చి ఆ కుటుంబానికి జగన్ న్యాయం చేస్తారని ఆ వర్గాలు అంటున్నాయి. రెడ్డి వర్గం నుంచి పలువురు రాజ్యసభ సీట్లు ఆశిస్తున్నా ఈసారి మాత్రం అయోధ్యరామిరెడ్డికే ఆ సీటు దక్కుతుందని అంటున్నారు.
రాజ్యసభలో బీసీలకు స్థానం కల్పించే యోచనలో జగన్ ఉన్నారు. అత్యధిక ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలను మరింత దగ్గర చేర్చుకోవాలంటే వారిలో ఒకరిని రాజ్యసభకు పంపడమే మంచిదని జగన్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే బీద మస్తాన్‌రావుకు అవకాశం కల్పించడానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవలే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావుకు రాజ్యసభ సీటు దక్కుతుందంటున్నారు. పార్టీలో చేరేటప్పుడే ఆయనకు హామీ ఇచ్చారంటున్నారు. అంతే కాకుండా పార్టీలో నెంబర్ టూగా ఉన్న విజయసాయిరెడ్డికి ఆయన స్నేహితుడని, ఆర్థికంగా బలవంతుడైన బీదకు రాజ్యసభ సీటు ఖాయమని ఆయన సన్నిహిత వర్గాలు చెప్పుకుంటున్నాయి.
శాసనమండలి రద్దయ్యే అవకాశాలున్న నేపథ్యంలో మంత్రివర్గంలో కొనసాగుతున్న బీసీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌ల్లో ఒకరికి రాజ్యసభ సీటు ఇస్తారని ఇటీవల వరకు ప్రచారం జరిగినా.. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో అది జరిగే వాతావరణం కనిపించడం లేదట. శాసనమండలి రద్దుకు కేంద్రం ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకున్నా మరో ఆరేడు నెలలు పడుతుందని, అప్పటి వరకు మోపిదేవి, పిల్లిలను మంత్రులుగా కొనసాగించి మరోసారి రాజ్యసభ సీటు ఇస్తారంటున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు తనకు రాజ్యసభ సీటు వస్తుందో.. రాదో అన్న ఆందోళనలో ఉన్న బీద ఇప్పుడు కొంత స్థిమితపడుతున్నట్లు తెలుస్తోంది.
మరో సీటు బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉన్న పరిమళ్ నత్వానీకి ఖాయమైపోయిందని ప్రచారం జరుగుతోంది. దీనిపై పరిమళ్ కూడా ఢిల్లీలో స్పందించారు. జగన్‌ను రాజ్యసభ సీటు గురించి అడిగిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. ఇటీవల రియలన్స్ అధినేత ముకేశ్ అంబానీ… ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో ఇదే విషయంపై చర్చించారని, బీజేపీ పెద్దలు ఇంతకు ముందే జగన్‌కు దీని గురించి చెప్పడంతో ఇక ఆయనకు సీటు లభించడం లాంఛనమేనని అంటున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా నత్వానీ పోటీ చేస్తారని, ఆయనకు వైసీపీ మద్దతు ఇస్తుందని చెబుతున్నారు. అంబానీకి సన్నిహుతుడైన పరిమళ్.. జార్ఖండ్ నుంచి రాజ్యసభకు స్వతంత్ర అభ్యర్థిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏప్రిల్ 8వ తేదీతో ఆయన పదవీకాలం పూర్తవుతుంది.
నాలుగో సీటు విషయంపై పార్టీలో చర్చోపచర్చలు జరుగుతున్నాయట. ఒకటి ఓసీ, మరోటి బీసీ, ఇంకోటి రిలయన్స్ కోటాకు పోతే… మిగిలిన సీటు ఎస్సీ వర్గాలకు ఇస్తారా? అనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఎస్సీ వర్గానికి ఇవ్వాల్సి వస్తే మహిళకు కేటాయించే అవకాశం ఉందంటున్నారు. పార్టీలో మహిళను ప్రోత్సహిస్తున్నారని, దాని ప్రకారం చూస్తే ఎస్సీ మహిళకు ఇస్తారని, అయితే రాజ్యసభకు పంపించగలిగిన అనుభవం ఉన్న మహిళ ఎవరనే దానిపై పార్టీలో చర్చ జరుగుతోందట. ఎస్సీ అధికారుల్లో పార్టీకి విధేయంగా ఉన్న మహిళకు ఈ సీటు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. నాలుగో అభ్యర్థి ఎవరో అన్న విషయం ఆఖరు నిమిషం వరకు తేలకపోవచ్చునట. ఆ వర్గం నుంచి సమర్ధులు లభ్యం కాకపోతే మహిళా కోటాలో తన సోదరి షర్మిలకు అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
పార్టీలో సీనియర్ నేతలైన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలలో ఒకరికి రాజ్యసభ సీటు ఇస్తారనే ప్రచారం మీడియాలో జోరుగా సాగుతోంది. అయితే వీరిద్దరికీ ఈసారి అవకాశం ఉండదంటున్నారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సుబ్బారెడ్డిలకు గతంలో రాజ్యసభ ఇస్తామనే హామీతోనే ఎంపీ సీట్లు ఇవ్వలేదని, ఆ హామీని నిలబెట్టుకోవాని వారి అనుచరులు కోరుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది నెరవేరే సూచనలు కనిపించడం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. మేకపాటి రాజమోహన్‌రెడ్డి తనయుడు ఇప్పటికే మంత్రిగా ఉన్నారని, ఇప్పుడు హడావుడిగా ఆయనకు రాజ్యసభ ఇవ్వాల్సిన అవసరం లేదని పార్టీలో ఒక వర్గం నేతలు అంటున్నారు. టీటీడీ చైర్మన్ పోస్టులో సుబ్బారెడ్డికి కూడా ఇప్పుడిప్పుడే రాజ్యసభ అవసరం లేని చెబుతున్నారు.