అక్టోబర్‌లోనే ఐపీఎల్ మ్యాచ్‌లు..!

2020 ఏడాదిలో ఐపీఎల్ జరుగుతుందా? కరోనా నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణ దాదాపు సాధ్యమేనా? అనే ఊహాగానాలకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో బ్రేక్ పడింది. ప్రస్తుత కరోనా పరిస్థితులు ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ ఎంతవరకు సాధ్యమనేదానిపై ఇప్పటికే అన్ని క్రికెట్ బోర్డులు ఒక అంచనాకు వచ్చేశాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో క్రీడా సముదాయాలు, స్టేడియాలకు అనుమతించనున్నారు. ఇప్పటివరకూ ఐపీఎల్ నిర్వహణపై ఆశలు వదేలిసుకున్న క్రికెట్ బోర్డులకు ఐపీఎల్ నిర్వహణపై ఆశలు చిగురించాయి. ప్రేక్షకులు లేని స్టేడియాల్లో ఐపీఎల్ నిర్వహించే దిశగా క్రికెట్ బోర్డులు, రాష్ట్ర క్రికెట్ సంఘాలతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్లు నిర్వహించడం మినహా మరో దారి కనిపించట్లేదు.
స్టేడియాలపై సడలింపులు ఫ్రాంచైజీల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఐపీఎల్ నిర్వహించే అవకాశముంటే కచ్చితంగా ఖాళీ స్టేడియాల్లోనే జరిగే అవకాశం ఉంది. ఇదేం కొత్తకాదు. దేశంలో చాలా మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండానే జరుగుతున్నాయి. రంజీ ట్రోఫీ ఫైనల్ కూడా ఖాళీ స్టేడియంలోనే నిర్వహించారు. ఐపీఎల్-13ను నిర్వహించాలా? లేదా? అన్నది కేంద్ర ప్రభుత్వం, బీసీసీఐ చేతుల్లోనే ఉంది. ప్రపంచకప్ కంటే ఐపీఎల్ జరగకపోతేనే తమకు ఎక్కువ నష్టమని బీసీసీఐ ఇప్పటికే స్పష్టంచేసింది. ఈ ఏడాది ఐపీఎల్జరగకపోతే బీసీసీఐకి రూ.4000 కోట్లు నష్టమని అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తెలిపాడు.
జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాకాలం కావడంతో మ్యాచ్ ల నిర్వహణకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. రెండు నెలల పాటు సాగే ఐపీఎల్ సీజన్ నిర్వహించాలంటే అందుకు తగిన అక్టోబర్ నుంచి నవంబర్ నెలలే సరైన సమయమని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచ కప్ కూడా అప్పుడే జరుగనుంది.
ఐపీఎల్ కప్ నిర్వహణపై ఈ నెల 28న జరిగే బోర్డు సమావేశంలో ఐసీసీ నిర్ణయాన్ని వెల్లడించనుంది. ఒకవేళ ప్రపంచ కప్ వాయిదే పడితే మాత్రం అక్టోబర్- నవంబర్ నెలలో ఐపీఎల్ నిర్వహణకు మార్గం సుగమం అవుతుందని ఫ్రాంచైజీలు అభిప్రాయపడుతున్నాయి. అక్టోబరులో ఐపీఎల్.. డిసెంబరులో టీ20 కప్ నిర్వహిస్తే క్రికెట్ మళ్లీ గాడిన పడుతుందని అంటున్నారు.
Read: లంక పర్యటనకు సిద్ధమైన టీమిండియా