Amaravati : శ్రీవారి ఆలయంలో రేపే విగ్రహ ప్రతిష్ట, మహాసంప్రోక్షణ

Srivari Temple Amaravati
Amaravati : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాళెం గ్రామంలో టిటిడి నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రేపు మహాసంప్రోణ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. జూన్ 4న ప్రారంభమైన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. జూన్ 9వ తేదీన గురువారం ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. మహాసంప్రోక్షణ కార్యక్రమాల కోసం టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టారు.

అక్షయమోచనం
మహాసంప్రోక్షణ అంటే….
నూతనంగా నిర్మించిన ఆలయంలో విగ్రహప్రతిష్ట చేయడానికి మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. ముందుగా విష్వక్సేనపూజ, అంకురార్పణం నిర్వహిస్తారు. మరుసటి రోజు నుండి ఐదు రోజుల పాటు విగ్రహానికి వివిధ రకాల శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వామివారి శక్తిని కుంభాల్లోకి (కలశాలు) ఆవాహన చేసి ప్రతిరోజూ రుత్వికులు నియమనిష్టలతో ఆరాధనలు, ఉక్త హోమాలు చేపడతారు. ఈ క్రమంలో విగ్రహానికి మొదటిరోజు పంచగవ్య ఆరాధన, రెండో రోజు క్షీరాధివాసం, మూడో రోజు జలాధివాసం, నాలుగో రోజు విమాన గోపుర కలశస్థాపన, విగ్రహస్థాపన, అష్టబంధనం కార్యక్రమాలు చేపడతారు.

క్షీరాదివాసం
చివరిరోజైన ఐదో రోజున మహాసంప్రోక్షణ ద్వారా కుంభాల్లోని స్వామివారి శక్తిని మూలమూర్తి (బింబం) లోకి ఆవాహన చేసి ప్రాణప్రతిష్ట చేస్తారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభమవుతుంది. సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు శాంతి కల్యాణోత్సవం జరుగనుంది. ఇక్కడ స్వామివారు చతుర్బుజాలు, శంఖుచక్రాలు, వరద, కటి హస్తాలు కలిగి ఉండి వక్షఃస్థలంలో శ్రీమహాలక్ష్మి అమ్మవారితో దర్శనమిస్తారు.
భక్తుల కోసం జర్మన్ షెడ్లు
జూన్ 9న మహాసంప్రోక్షణకు విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో ఆలయం ఎదురుగా జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు అందించే ఏర్పాట్లు చేశారు. 40 మొబైల్ మరుగుదొడ్లు అందుబాటులో ఉంచారు. మూడు స్వాగత ఆర్చిలు, నగరంలోని ముఖ్యమైన 50 ప్రాంతాల్లో మహాసంప్రోక్షణకు భక్తులకు ఆహ్వానం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆలయం నుండి ప్రధాన రోడ్డుకు అప్రోచ్ రోడ్డు, రెండు లైన్ల బ్యారీకేడ్లు, సాంస్కృతి కార్యక్రమాల నిర్వహణ కోసం స్టేజి తదితర ఏర్పాట్లు చేశారు.
ఆలయంలో సేవలందించేందుకు వివిధ విభాగాల నుండి దాదాపు 400 మంది సిబ్బందిని డెప్యుటేషన్‌పై నియమించారు. భక్తులకు సేవలందించేందుకు శ్రీవారి సేవకులు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు భజన బృందాలు కలిపి 2 వేల మంది విచ్చేయనున్నారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర స్వామి, టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి తదితర ప్రముఖులు విచ్చేయనుండడంతో తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ప్రత్యేక ఆకర్షణగా శంఖుచక్ర నామాలు
నూతన ఆలయం వద్ద విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసిన శంఖుచక్ర నామాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అదేవిధంగా, ఆలయ ప్రాకారం, ఆలయ విమానం, గోపురాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆర్‌జిడి లైటింగ్ ఏర్పాటుచేశారు. ఆలయం ప్రాంగణంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరణలు చేపట్టారు. ఇందుకోసం రెండున్నర టన్నుల పుష్పాలు, 20 వేల కట్ ఫ్లవర్లు వినియోగించారు. ఉద్యానవన విభాగంలో 30 మంది సిబ్బంది సేవలందించారు.