Bathukamma 2023 : బతుకమ్మలో పేర్చే ఒక్కో పువ్వుకి ఒక్కో అర్థం, రమణీయమైన పూలలో ఔషధ గుణాలు
పువ్వులనే దేవతగా కొలుచి పూజించే అరుదైన పండుగ, అపురూపమైన పండుగ, అమూల్యమైన ప్రకృతి పండుగ బతుకమ్మ.ప్రకృతితో మమైకం అయ్యే పర్యావరణహితమైన పండుగ.
Bathukamma 2023 : రంగురంగు పూలతో చేసుకునే పూల పండుగ. సాధారణంగా పూజకు పువ్వులను వినియోగిస్తారు. కానీ పువ్వులనే దేవతగా కొలుచి పూజించే అరుదైన పండుగ, అపురూపమైన పండుగ, అమూల్యమైన ప్రకృతి పండుగ బతుకమ్మ. పూలనే గౌరీదేవిగా పూజించే అద్భుతమైన పండుగ. ప్రకృతితో మమైకం అయ్యే పర్యావరణహితమైన పండుగ. చిన్నా పెద్ద, పేద, ధనిక అనే బేధభావనలు లేకుండా గౌరమ్మను తన్మయత్వంతో ఆరాధించే పండుగ బతుకమ్మ. ఆశ్వయుజ మాసం ఆరంభం అమావాస్య రోజు నుంచి ‘ బతుకమ్మ’ వేడుకలను తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు ఆటపాటలతో ఉత్సాహంగా జరుపుకుంటారు. తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూలతో అలంకరించి బతుకమ్మను పేరుస్తారు.
ఈబతుకమ్మలో ఉపయోగించే పూలకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక్కో పువ్వుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. ఒక్కో అర్థం ఉంది. బతుకమ్మలో ఉపయోగించే ప్రతి పువ్వు ఆరోగ్యానికి ప్రతీక. బతుకమ్మలను ఒకచోట చేర్చి.. ఆడపడుచులంతా చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ పాటలు పాడతారు.
ఏమేమీ పువ్వొప్పనే గౌరమ్మ.. ఏమేమీ కాయొప్పనే గౌరమ్మ అంటూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతారు. అటువంటి అందాల అరుదైన బతుకమ్మ పూల ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం..బతుకమ్మలో ఉపయోగించే ప్రతి పువ్వు ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతాయి. మరి ఆ పూలు ఏంటో..వాటి ప్రత్యేకతలేంటో.. వాటితో వచ్చే లాభాలేంటో తెలుసుకుందామా..
తంగేడు పూలు..
బతుకమ్మ ముందు వరసలో ఉండేవి తంగేడు పూలు, పసిడి వర్ణంలో మెరిసే వీటిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. జ్వరం, మలబద్దకానికి ఇది మంచి ఔషదం. తంగేడు పూలని ఆరబెట్టి దాంట్లో ఉసిరికాయ పొడి, పసుపు సమాన భాగాలుగా తీసుకొని కలపాలి. దీన్ని రెండు పూటలా తినడానికి అరగంట ముందు గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. ఇది తెలంగాణ ప్రాంతంలో విరివిగా దొరుకుతాయి. తంగేడు పువ్వు తెలంగాణ రాష్ట్ర పుష్పం.
తామర పూలు..
తామర పువ్వు అందానికి, స్వచ్ఛతకు ప్రతీక. లక్ష్మీదేవి నివాసం తామరపూలు. దీన్ని రక్తస్రావ నివారణకు ఉపయోగిస్తారు. సుగంధ ద్రవ్యాల్లో ఉపయోగించే ఈ తామరపూలు ఎన్నో రంగుల్లో ఉంటాయి. రంగు ఏదైనా అందానికి ప్రతీకంగా ఉంటాయి. ఈ తామరపూలను చూస్తే ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. ఆకట్టుకునే ఆకర్షణేకాదు ఈ పూలు ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడతాయి. మలబద్దకంతో బాధపడేవారికి తామర తైలం దివ్య ఔషధంగా పనిచేస్తుంది. తామర పువ్వు రేకులు, కుంకుమపుప్పు, కలువ పువ్వులతో కలిపి ముఖానికి రాస్తే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు ఈ పువ్వుతో అనేక చర్మ సంబంధ వ్యాధులను నివారించవచ్చు. కళ్లు ఎర్రగా మారితే తామరపూల రేకులు కళ్లమీద పెట్టుకుంటే వేడి తగ్గి ఉపశమనం కలుగుతుంది.
గునుగు పూలు..
గునుగు పువ్వు గడ్డిజాతికి చెందిన పువ్వు.బతుకమ్మ అలంకరణలో గునుగు పువ్వు ఎంతో శోభను ఇస్తుంది. రంగు రంగుల్లో ఈ పువ్వు చక్కటి ఆకర్షణీయంగా ఉంటుంది. జొన్న కంకిలా కనిపించే ఈ గునుగు పూలు చాలా రంగుల్లో ప్రకృతి ఒడిలో కనిపిస్తాయి. కనువిందు చేస్తాయి. గునుగుపూలను దీన్ని అతిసార నివారణకు మందుగా వాడుతారు. ఈ పువ్వును చర్మంపై గాయాలు, పొక్కులు, క్షయవ్యాధి నివారణకు ఉపయోగిస్తారు. రక్త పోటును అదుపులో ఉంచడంలో దీనికి మరేది సాటిరాదని ఆయుర్వేదం చెబుతోంది. ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజుల్లో వస్తుంది కాబట్టి ఆ సమయంలో ఈ గునుగులు విరబూసి కనిపిస్తాయి. బతుకమ్మలో ఇమిడిపోతాయి.అప్పటికే వర్షాలతో చెరువులన్నీ బాగా నీటితో నిండి ఉంటాయి.
గుమ్మడి పువ్వు..
గుమ్మడి పువ్వు బతుకమ్మలో ప్రధమస్థానం. గుమ్మడి పువ్వునే గౌరమ్మగా భావించి పూజిస్తారు. ఆరాధిస్తారు. గుమ్మడి పువ్వులో ఎ, సి విటమిన్లు ఉంటాయి. దీని సైంటిఫిక్ పేరు ‘కుకుంబిటాపిపో’. వయసు మీద పడ్డాక వచ్చే కాళ్ల నొప్పుల్ని తగ్గిస్తుంది. ప్రొస్టేట్ గ్రంథికి ఎలాంటి హాని కలగకుండా చేస్తుంది. డ్రై స్కిన్ ఉన్నవాళ్లు వాడితే స్కిన్‌కి చాలా మంచిది.
కట్ల పువ్వు..
కట్ల పువ్వు నీలి రంగులో ఉంటుంది. దీని సైంటిఫిక్ పేరు ‘జకు మోంటియా నెంటాథోన్’. ఈ పూలలో డయాబెటిస్, ఇన్ఫ్లమేషన్, క్యాన్సర్‌ను తగ్గించే గుణాలున్నాయి. ఇవే కాదు, ఈ సీజన్లో పూసే చామంతి, టేకీ, గులాబీ, సోంపు వంటి పూలన్నీ బతుకమ్మ తయారీలో వాడుకోవచ్చు.
బీరపువ్వు
బీరపువ్వు పపుసు పచ్చగా ఉంటుంది. బతుకమ్మకు చక్కటి అందాన్నిస్తుంది. బీరపువ్వు సీజనల్ ఫ్లవర్. దీని సైంటిఫిక్ పేరు ‘లుఫా’. బీరకాయలను ఎండబెట్టి అందులో ఏర్పడే పీచును రంగుల్లో వాడతారు. బతుకమ్మను పేర్చేటప్పుడు నుదుటన తిలకం దిద్దినట్లుగా బీరపువ్వును పెడతారు. వీటిలో బంతి, చామంతి వర్షాకాలం దోమల నివారణకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా నందివర్ధనం ప్రత్యేక గుణాలు కల పుష్పం. దీనివల్ల కండ్లకు మేలు జరుగుతుంది. అంతేకాదు ఇది పలు ఆయుర్వేద ఔషధాల్లో, చిట్కావైద్యంలో ఉపయోగిస్తారు.
బొగడబంతి పూలు..
బొగడబంతి పూలు..చూడటానికి చాలా చాలా అందంగా ఉంటాయి.ఈ పూల చెట్టుకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి..!! ఈ మొక్కను గ్లోబ్ ఉసిరి, వడ మల్లి, గుండి బంతి అని పిలుస్తారు. ఈ మొక్కలో బీటాసైనిన్ ఉంటుంది. లుకేమియా క్యాన్సర్ కణాలు మాయాజాలం ద్వారా బీటాసైనిన్‌లను అడ్డుకుంటాయి. బోగడ బంతి మొక్క నుంచి బీటాసైనిన్‌లను సేకరించి క్యాన్సర్ మందుల్లో వాడుతున్నారని పలువురు ఆరోగ్య పరిశోధకులు చెబుతున్నారు. ఈ మొక్క యొక్క ఆకులు మరియు విత్తనాలు మూత్ర మరియు ప్రోస్టేట్ క్యాన్సర్‌లో సహాయపడతాయి. ఈ మొక్కలలో ఉండే ఫ్రీ రాడికల్స్ మన చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుండి రక్షిస్తాయి. ఇది కాకుండా, ఈ మొక్కలు యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి దగ్గు, జలుబు, వైరస్‌లను నివారిస్తాయి.
సీత జడ పూలు..
సీత జడ పూలనే సీతమ్మవారి జడగంటలు అని అంటారు. ముదురు రంగులో కనిపించే ఈ పూలు కనువిందు చేస్తాయి. చక్కటి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మెత్తగా పట్టుకుచ్చులా అలరిస్తాయి. ఈ పూలు మన తోటలో ఉంటే ఎంత దూరం నుంచి అయినా ఇట్టే కనిపిస్తాయి. అంటి రంగు ఈ సీతమ్మ జడ పూల సొంతం. ఈ సీతమ్మ జడల పూల గురించి ఎంతోమంది కవులు ఎన్నో కవితలు రాశారు. ముఖమల్లు పూలు, మెత్తన్ని పూలు, మహమల్లు పూలు, మహరాణీ పువ్వులు,శ్రీరామ చంద్రులకు
మనసారా ఇచ్చేనీ మనసైన పూలు మా సీతమ్మ జడ కుప్పెపూలు అంటూ ఈ పువ్వుల గొప్పతనాన్ని పొగిడేస్తారు. ఈ పూలను నారలు, రంగుల తయారీలో వాడతారు. సిలోసియా అరిగేటియా అమరాంథస్ దీని సైంటిఫిక్ పేరు.
బంతి, చేమంతి, నంది వర్ధనం గునుగు పూలు, తంగేడు పూలు అలా రకరకాల పూలను ఉపయోగించి బతుకమ్మను పేరుస్తారు. అంతేకాదు బతుకమ్మలో అన్ని పూలు మమేకమైపోతాయి. బంతి, చామంతి,గులాబీ ఇలా అన్ని రకాల పూలు తమదైన శోభనిస్తాయి బతుకమ్మకు. బతుకమ్మ పేర్చే పూలన్నింటిని గమనిస్తే అవన్నీ తెలంగాణ పల్లెల్లో విరివిగా దొరికేవే కావటం విశేషం. అంతేకాదు అవన్నీ అందరికీ అంటే సామాన్యుడి నుంచి శ్రీమంతుల వరకు ఎవ్వరికైనా సులభంగా, డబ్బులు ఖర్చు పెట్టకుండానే దొరుకుతాయి. అంటే డబ్బులు ఖర్చు పెట్టకుండానే ప్రకృతిలో దొరికే అమూల్యమైన పూలే బతుకమ్మను పేర్చడానికి ఉపయోగిస్తారు.
బతుకమ్మలో వాడే ప్రతీ పువ్వు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చేస్తాయి. వర్షాకాలంలో నిండుకుండల్లాగా ఉండే చెరువులు, కుంటలూ వీటితో శుభ్రం అవుతాయి. వీటన్నింటి వెనుక సైన్స్ ఉందని నిపుణులు చెబుతారు. ఏది ఏమైనా బతుకమ్మ నిజంగా మన బతుకులలో రంగురంగుల పూల పండుగే. రోటీన్ లైఫ్‌కు భిన్నంగా దూరమవుతున్న ఆప్యాయతలు, పలకరింపులను కాపాడే ఆత్మీయ పండుగ.