Brahma Temple : అరుదైన బ్రహ్మదేవాలయం.. బిందుసాగర్

ఆవుల పాలు పితుకుతునట్లు శివుని జాడను గుర్తిస్తుంది. ఆసమయంలో పార్వతీదేవి బసా మరియు కీర్తి అనే ఇద్దరు రాక్షసులతో యుద్ధం

Brahma Temple : అరుదైన బ్రహ్మదేవాలయం.. బిందుసాగర్

Bindusagar

Updated On : August 19, 2021 / 5:02 PM IST

Brahma Temple : 15వ శతాబ్ధానికి చెందిన కళింగ శైలిలో నిర్మితమైన ఆలయం బిందుసాగర్ బ్రహ్మదేవాలయం. ఎంతో ప్రసిద్ధ చరిత్రకలిగిన అరుదైన బ్రహ్మదేవాలయంగా గుర్తింపుపొందింది. ఆనాటి గజపతిరాజుల నిర్మాణ శైలికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ ఆలయంలో బ్రహ్మ విగ్రహం నాలుగు చేతులను కలిగి ఉంటుంది. చేతుల్లో వేదాలు, నీటి పాత్ర, అభయముద్రను కలిగిన స్వామి ఆలయం బిందుసాగర్ నీటి కొలను మధ్య భాగంలో ఈ ఆలయం నిర్మితమై ఉంది. స్ధానికులు దీనిని జగపతి ఆలయంగా పిలుస్తారు. లింగరాజ ఆలయం నుండి ఎడమ వైపున ఉన్న రోడ్డులో భువనేశ్వర్ లోని పశ్చిమాన బిందుసాగర్ ట్యాంక్ తూర్పు ఒడ్డుగా ఈ ఆలయం కొలువై ఉంటుంది.

ఈ ఆలయానికి పెద్ద చరిత్రే ఉంది. లింగరాజస్వామి యొక్క పట్టాభిషేకం కోసం బ్రహ్మ భువనేశ్వర్ వచ్చారు. ఆసమయంలో తాను ఎప్పటికీ ఇక్కడే ఉండాలని కోరగా, ప్రతి సంవత్సరం అశోకాష్టమి పండుగ కోసం చైత్రమాసం నెలలో అక్కడికి వస్తానని హామీ ఇచ్చారట. లింగరాజకు చెందిన రుకునా రథయాత్రకు సారథిగా ఉంటానని చెప్పారట.. అందువల్లే బిందుసాగర్ సమీపంలో బ్రహ్మను గౌరవించటానికి ఒక ఆలయం నిర్మించబడింది.

పురాణ చరిత్ర ప్రకారం శివుడు,పార్వతి వివాహం తరువాత వారణాసిలో స్థిరపడ్డారు. కాలక్రమేణా, వారణాసి జనాభాగల ప్రదేశంగా మారటంతో, మారువేషంలో ధ్యానం చేయడానికి శివుడు కొత్త ప్రదేశాన్ని వెతకనారంభించాడు. అడవిలో పెద్ద మామిడి చెట్టు ఉన్నప్రాంతానికి ధ్యానం కోసం అనుకూలప్రాంతంగా ఎంచుకుంటాడు. పార్వతిదేవి శివుని ఆచూకీ తెలుసుకుని అతని కోసం వెతుకుతూ వెళుతుంది. ఆవుల పాలు పితుకుతునట్లు శివుని జాడను గుర్తిస్తుంది. ఆసమయంలో పార్వతీదేవి బసా మరియు కీర్తి అనే ఇద్దరు రాక్షసులతో యుద్ధం చేస్తుంది. పార్వతిదేవి రాక్షసులతో యుద్దం తర్వాత చాలా దాహంతో ఉండగా, ఆమె దాహాన్ని తీర్చడానికి శివుడు ఈ ప్రదేశంలో తన త్రిశూలాన్ని భూమిలోకి వేశాడని, అప్పుడు నీరు భూమి పైకి వచ్చి పవిత్ర బిందూ సాగర్ గా పెద్దనీటి కొలనుగా మారిందని చెబుతుంటారు.

బిందుసాగర్ ట్యాంక్ క్రీ.శ 7 వ – 8 వ శతాబ్దానికి చెందినదని నమ్ముతారు, నగరంలోని ఇతర దేవాలయాలతో సమకాలీనమైనది. బిందుసాగర్ ట్యాంక్ భువనేశ్వర్ లోని అతిపెద్ద నీటి వనరు. బ్రహ్మ ఆలయాన్ని సందర్శించదానికి వెళ్ళడానికి ఎవరైనా పడవలో ప్రయాణించాలి. 42 రోజుల చందన్ యాత్ర ఉత్సవంలో భాగంగా, లింగరాజు స్వామి ఉత్సవ విగ్రహాన్ని పడవలో బ్రహ్మఆలయానికి తీసుకురావటం అచారంగా కొనసాగుతుంది. ఉత్సవాల సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.

ఈ ఆలయానికి చేరుకునేందుకు విమాన రైలు రోడ్డుమార్గం అందుబాటులో ఉన్నాయి. ఒరిస్సాలోని భువనేశ్వర్ చేరుకొని అక్కడి నుండి ఆటోలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఆలయ దర్శన సమయాలు ఉదయం 6:00 గంటల నుండి మధ్యాహ్నం1:30 గంటల వరకు, సాయంత్రం 3:00 గంటల నుండి 8:30 గంటల వరకు.