Koil Alwar Thirumanjanam : శ్రీవారి ఆల‌యంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం (జూలై 13) కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం వైభవంగా వేడుకను నిర్వహించారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనంతరం 11 గంటలకు భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు.

Koil Alwar Thirumanjanam : శ్రీవారి ఆల‌యంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

Koil Alwar Thirumanjanam Performed At Tirumala Temple

Updated On : July 13, 2021 / 11:28 AM IST

Koil Alwar Thirumanjanam : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం (జూలై 13) కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం వైభవంగా వేడుకను నిర్వహించారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనంతరం 11 గంటలకు భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు. ఏడాదికి నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహిస్తోంది. సాధార‌ణంగా ఏడాదిలో నాలుగుసార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ ఈవో డాక్ట‌ర్ కేఎస్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ఈవో డాక్ట‌ర్ కేఎస్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 16న శ్రీ‌వారి ఆల‌యంలో సాల‌క‌ట్ల ఆణివార ఆస్థానాన్ని పుర‌స్క‌రించుకుని ఈ రోజు ఉద‌యం కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హించిన‌ట్లు చెప్పారు. ఆలయంలోని ఆనందనిలయం నుంచి బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, గోడలు, ఆలయ ప్రాంగణం, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేశామన్నారు.

శుద్ధి స‌మ‌యంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పివేశారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు నిర్వహిస్తారు. ఆ తర్వాతే భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.