Maha Shivaratri 2024 : తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి శోభ ఉట్టిపడుతోంది. శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి.

Maha Shivratri Festival : తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి శోభ ఉట్టిపడుతోంది. శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. ముఖ్యంగా శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర ఆలయాలతోపాటు.. పలు ప్రాంతాల్లో ఆలయాల వద్దకు భక్తులు తెల్లవారు జామున నుంచే పోటెత్తారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం అర్థరాత్రి దాటాక భక్తులను దర్శనానికి ఆలయంలోకి అనుమతించారు.

Also Read : Maha Shivratri 2024: శివుడి 12 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకోవాల్సిందే..

మహాశివరాత్రి అంటేనే భక్తుల చూపులన్నీ మహాశివుడు శ్రీశైలం మల్లన్నవైపే ఉంటాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ శ్రీశైలం మలన్న దర్శనంకోసం కాలినడకన వెళ్ళే భక్తులతో కర్నూలు జిల్లాలోని నల్లమల ఆటవీప్రాంతం శివనామస్మరణతో మారుమోగుతోంది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలానికి కాలినడకన వెళ్లి దర్శించుకునేందుకు ఏకైక మార్గం కావడంతో దేశం నలమూలల నుంచి భక్తులు ఈ ప్రాంతానికి తరలివస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం వేకువజాము నుంచి శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామి, అమ్మవార్ల దర్శనానికి తెల్లవారు జాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. దీంతో శివనామస్మరణతో శ్రీశైలం ఆలయం మారుమోగుతోంది. భక్తులు వేకువ జామున నుంచి పాత:గంగలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటున్నారు.

Also Read : Maha Shivratri 2024: మహాశివరాత్రి నాడు ఏ రాశివారు ఏ మంత్రం జపించాలో తెలుసా?

రాజన్నసిరిసిల్ల జిల్లా శివ నామస్మరణతో మారుమోగుతోంది. వేములవాడ రాజన్న క్షేత్రంలో మహాశివరాత్రి సందర్బంగా పరమశివుడికి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు తెల్లవారు జామునుంచే భక్తులు బారులు తీరారు. ముందుగా కోడె మొక్కులు చెల్లించి ఆ తర్వాత రాజన్నను దర్శించుకుంటున్నారు. ఇక సాయంత్రం స్వామివారి సన్నిధిలో భక్తులు జాగరణలకు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైభవంగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు జరుగుతున్నాయి. శైవక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని పంచరామ క్షేత్రానికి పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి, పట్టిసం వీరభద్రకాళీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. తెల్లవారు జామునుండే భక్తులు అభిషేకాలు, స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఏలూరు జిల్లా బలివే ఉభయ రామలింగేశ్వర స్వామి ఆలయంకు భక్తులు భారీగా తరలివచ్చారు. అదేవిధంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లా పెదకాకానిలో శ్రీగంగా భ్రమరాంభా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామివారి దర్శనార్ధం భక్తులు పోటెత్తారు. ఇలా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి.

 

 

 

ట్రెండింగ్ వార్తలు