Maha Shivratri 2024: శివుడి 12 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకోవాల్సిందే..

రామేశ్వరం జ్యోతిర్లింగం తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది. ఈ శివలింగాన్ని దర్శిస్తే అన్ని రోగాలు..

Maha Shivratri 2024: శివుడి 12 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకోవాల్సిందే..

Jyotirlingas

మహాశివరాత్రి వచ్చేస్తోంది. శివుడి మహిమల గురించి ఎంత చెప్పినా తక్కువే. శివుడి 12 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకోవాల్సిందే. సోమనాథ జ్యోతిర్లింగం మొదలుకుని ఘృష్ణేశ్వర దేవాలయం వరకు అన్ని జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాం..

  • సోమనాథ జ్యోతిర్లింగం గుజరాత్‌లోని సౌరాష్ట్రలో ఉంటుంది. శివపురాణం ప్రకారం దీన్ని చంద్రుడు స్వయంగా స్థాపించాడు. ప్రస్తుతమున్న సోమనాథ జ్యోతిర్లింగం ఆలయాన్ని 1951లో పునర్నిర్మించారు. ఈ క్షేత్రం 12 జ్యోతిర్లింగాలలో మొదటిది.
  • జ్యోతిర్లింగాలలో రెండోది శ్రీశైలం భ్రమరాంబమల్లిఖార్జున స్వామి ఆలయం. ఇది దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం శివపార్వతుల నిలయం. ఏపీలోని కృష్ణానది ఒడ్డున శ్రీశైలం అనే పర్వతంపై ఉంటుంది. ఈ ఆలయానికి వచ్చి దర్శనం, పూజలు చేస్తే.. అశ్వమేధ యాగం చేయడం వలన వచ్చే పుణ్యముతో సమానమైన పుణ్యము లభిస్తుందని విశ్వాసం. ఇక్కడ భక్తులకు స్పర్శ లింగ దర్శనం ఉంటుంది.

 

  • మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో ఉంది. అందుకే ఉజ్జయిని మహాకాళేశ్వర నగరం అని కూడా అంటారు. మహాకాళేశ్వరం ఒక్కటే దక్షిణాభిముఖంగా ఉన్న జ్యోతిర్లింగం. ఇక్కడ రోజుకు 6 సార్లు శివునికి హారతి ఇస్తారు. ఇది భస్మ హారతితో ప్రారంభమవుతుంది. మహా కాల సమయంలో ఉదయం 4 గంటలకు భస్మహారతి నిర్వహిస్తారు. దీనిని మంగళ హారతి అని కూడా అంటారు. మహాకాళేశ్వర జ్యోతిర్లింగ భస్మ హారతి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
  • ఓంకారేశ్వర ఆలయం 12 జ్యోతిర్లింగాలలో నాల్గోది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలోని మాల్వా ప్రాంతంలో ఉంటుంది ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగం చుట్టూ ప్రవహించే నదులు, పర్వతాలు ఓం ఆకారంలో దర్శనం ఇస్తాయి. నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ఏకైక దేవాలయం ఇదే. ఇక్కడ శివుడు నదికి రెండో ఒడ్డున కొలువై ఉన్నాడు. శివుడు ఇక్కడ మాలేశ్వరుడు, అమలేశ్వరుడుగా భక్తులతో పూజలను అందుకుంటున్నాడు.

 

  • కేదార్‌నాథ్ జ్యోతిర్లింగం సముద్ర మట్టానికి 3వేల 584 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కేదార్‌నాథ్ ఆలయం ఉత్తర భారతదేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో హిమాలయాల్లో కేదార్ అనే శిఖరంపై ఉంది. ఇక్కడ మందాకినీ నది పైభాగంలో మంచు కప్పిన కొండల మధ్య కొలువై ఉన్నాడు మహాశివుడు. ఈ గుడిని ఆదిశంకరులు నిర్మించినట్లు విశ్వసిస్తున్నారు.
  • మహారాష్ట్రలోని పుణేకు 110 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భీమశంకర జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగం సహ్యాద్రి అనే పర్వతంపై ఉంది. మహాదేవుడి 12 జ్యోతిర్లింగాలలో భీమశంకర జ్యోతిర్లింగం ఆరవ జ్యోతిర్లింగంగా భావిస్తారు భక్తులు. ఇక్కడి స్థానిక ప్రజల మోటేశ్వర మహాదేవ అనే పేరుతో ఈ ఆలయాన్ని పిలుస్తారు. భీముడు కారణంగా తలెత్తిన వివత్తును తొలిగించి నందువల్ల ఆ భీమశంకర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి గాంచింది.

 

  • కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం యూపీలోని వారణాసిలో గంగానది ఒడ్డున ఉంటుంది. కాశీ విశ్వనాథ ఆలయానికి పురాతన కాలం నుంచి సుదీర్ఘమైన గొప్ప చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని శివుడు స్వయంగా నిర్మించాడని నమ్ముతారు భక్తులు.
  • త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం నాసిక్ జిల్లాలో ఉంటుంది. ఈ జ్యోతిర్లింగానికి దగ్గరలో ఉన్న బ్రహ్మగిరి అనే పర్వతంలో గోదావరి నది పుట్టింది. దక్షిణ భారతదేశంలో గోదావరి నదిని పావినాసిని అని గంగా నదితో సమానంగా పరిగణిస్తారు. ఈ ఆలయం బ్రహ్మగిరి, నీలగిరి, కాలగిరి అనే మూడు కొండల మధ్య ఉంటుంది. టెంపుల్ లో శివుడు, విష్ణువు, బ్రహ్మను సూచించే మూడు లింగాలు ఉన్నాయి. ఇక్కడ బిల్వతీర్థం, విశ్వనంతీర్థం, ముకుందతీర్థం అనే మూడు ఇతర జలధారలు ఉన్నాయి.
  • వైద్యనాథ జ్యోతిర్లింగం ఝార్ఖండ్, సంతాల్ పరగణా సమీపంలో ఉంటుంది. ఈ వైద్యనాథ్ ధామ్‌ను చితాభూమి అంటారు. వైద్యనాథ్ ధామ్ మొత్తం 12 శివ జ్యోతిర్లింగ ప్రదేశాల్లో ప్రధానమైంది.
  • నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్‌లోని ద్వారకలో ఉంది. రుద్ర సంహితలో శివుడిని దారుకావన నాగేశంగా పిలుస్తారు. నాగేశ్వర్ అంటే పాముల దేవుడు.
  • రామేశ్వరం జ్యోతిర్లింగం తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది.  ఈ శివలింగాన్ని దర్శిస్తే అన్ని రోగాలుపోతాయని భక్తుల నమ్మకం.
  • ఘృష్ణేశ్వర దేవాలయం జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని ఉంటుంది. ఇది దౌల్తాబాద్ సమీపంలో ఉంది. ఇది భక్తుడైన ఘుష్మా భక్తికి చిహ్నం.
  • దేశంలో పన్నెండు జ్యోతిర్లింగాలతో పాటు మరెన్నో పేరుగాంచిన శివాలయాలు, త్రిలింగక్షేత్రాలు ఉన్నాయి. అన్ని ఆలయాల్లో శివుడే ప్రత్యక్షంగా ఉన్నాడని భక్తుల నమ్మకం.అందుకే దేశంలోని నార్త్, సౌత్ అని తేడా లేకుండా ఏ ప్రాంతం నుంచైనా ఈ జ్యోతిర్లింగాల దర్శనాలకు వెళ్తుంటారు భక్తులు. మహాశివరాత్రి వేడుకలు మాత్రం.. ఈ జ్యోతిర్లింగ క్షేత్రల్లో నేత్రపర్వంగా జరుగుతాయి.

Maha Shivratri 2024: మహాశివరాత్రి నాడు ఏ రాశివారు ఏ మంత్రం జపించాలో తెలుసా?