Appalayagunta : అప్పలాయగుంటలో వైభవంగా పుష్పయాగం

తిరుపతి జిల్లాలోని   అప్పలాయగుంటలో  వేంచేసి యున్న   శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం పుష్పయాగం వైభవంగా జరిగింది.

Appalayagunta : అప్పలాయగుంటలో వైభవంగా పుష్పయాగం

Appalaya Gunta

Updated On : July 15, 2022 / 9:47 PM IST

Appalayagunta :  తిరుపతి జిల్లాలోని   అప్పలాయగుంటలో  వేంచేసి యున్న   శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం పుష్పయాగం వైభవంగా జరిగింది. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.

ఆల‌యంలో జూన్ 10 నుండి 18వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. నిత్యకైంకర్యాల్లో గానీ, బ్రహ్మోత్సవాల్లో గానీ, అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఉదయం 11 నుంచి 12.30 గంటల వరకు ఉభయ దేవేరులతో కూడిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి    స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. ముందుగా పుష్పయాగం కోసం వినియోగించే పుష్పాలను ఆలయంలో మూలమూర్తి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

New Project (3)

ఆ తరువాత ఆలయ ప్రదక్షిణగా వెళ్లి మాడ వీధుల్లో ఊరేగింపు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై సర్వభూపాల వాహనంలో శ్రీపద్మావతి, శ్రీఆండాళ్‌ సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారిని కొలువు  తీర్చారు.

New Project (2)

 మధ్యాహ్నం 2.50 నుండి సాయంత్రం 5 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 14 రకాలకు చెందిన 1.2 టన్నుల పుష్పాలు, పత్రాలతో పుష్పయాగం నిర్వహించారు. ఆ తరువాత పెద్ద‌శేష వాహనంపై స్వామివారు ఆల‌య మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు.