Ashada Bonalu 2022 : ప్రారంభమైన ఆషాఢ బోనాలు

రాష్ట్రంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని..గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారికి.. శాస్త్రోక్తంగా తొలి బోనం  నిన్న సమర్పించారు.

Ashada Bonalu 2022 : ప్రారంభమైన ఆషాఢ  బోనాలు

Ashada Bonalu 2022

Updated On : July 1, 2022 / 10:32 AM IST

Ashada Bonalu 2022 : రాష్ట్రంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని..గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారికి.. శాస్త్రోక్తంగా తొలి బోనం  నిన్న సమర్పించారు. లంగర్‌హౌజ్ చౌరస్తాలో.. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అక్కడి నుంచి పట్టువస్త్రాలు, తొట్టెల ఊరేగింపుతో.. చోటాబజార్‌లోని ఆలయ పూజారి ఇంటి నుంచి అమ్మవారి విగ్రహం, ఘటం ఊరేగింపుతో గోల్కొండకు చేరుకున్నారు. బంజారా దర్వాజ నుంచి తొలి బోనం.. అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో.. హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా పాల్గొన్నారు.

బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక.. నగరంలోని ప్రతి అమ్మవారి ఆలయానికి ఆర్థికసాయం అందించిన ఘనత.. టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. కులమతాలకతీతంగా.. ఎనిమిదేళ్లుగా.. రాష్ట్రంలో బోనాలను ఎంతో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు తలసాని. కరోనా కారణంగా.. రెండేళ్లుగా సందడి తగ్గింది. దీంతో.. ఈసారి బోనాల ఉత్సవాలను.. ఎంతో ఘనంగా నిర్వహించేందుకు సర్కార్ ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల కోసం 15 కోట్లు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం.

నగరంలో ఎల్లుండి (జులై 3,ఆదివారం) గోల్కొండ బోనాలు జరగనున్నాయి. భక్తులంతా.. అమ్మవారికి బోనం మొక్కులు సమర్పించనున్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని..  గోల్కొండ పరిసర ప్రాంతాలను ముస్తాబు చేస్తున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్లుగా.. పోలీసు యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసింది. సుమారు 8 వందల మందికి పైగా పోలీసులతో పాటు ప్లాటూన్ బలగాలతోనూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గోల్కొండ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఆర్మ్ రిజర్వ్, షీ టీమ్స్, ట్రాఫిక్, తెలంగాణ పోలీస్ బెటాలియన్, క్యూఆర్టీ టీమ్ సంయుక్తంగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా మంచి నీటి సౌకర్యం, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు అధికారులు. ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

గోల్కొండ బోనాల తర్వాత ఈనెల పదవ తేదిన లష్కర్, జులై 17న లాల్ దర్వాజ బోనాలు జరగనున్నాయి. ఇదే నెలలో.. ధూల్ పేట, బల్కంపేట, పాతబస్తీ అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు నిర్వహించనున్నారు. గోల్కొండ జగదాంబికకు తొలి బోనం సమర్పణతో.. హైదరాబాద్‌లోనే కాదు మొత్తం తెలంగాణలోనే.. ఉత్సవాలు మొదలయ్యాయ. ఈనెల 28 వరకు ఆషాఢ బోనాలు జరుగుతాయి.

Also Read : TSRTC: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ఆ బస్సెక్కితే స్వామివారి దర్శనం టికెట్..