Sri Varaha Swamy Temple : వరాహస్వామివారి ఆలయ విమాన జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ
తిరుమల గిరులపై వేంచేసిన శ్రీ వరాహస్వామివారి ఆలయ విమాన జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నవంబరు 25 నుండి 29వ తేదీ వరకు జరుగుతాయని టీటీడీ ఒక ప్రకటనలో తెల

Aadhi Varaha Swamy Temple Tirumala
Sri Varaha Swamy Temple : తిరుమల గిరులపై వేంచేసిన శ్రీ వరాహస్వామివారి ఆలయ విమాన జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నవంబరు 25 నుండి 29వ తేదీ వరకు జరుగుతాయని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమాలకు రేపు నవంబర్ 24న అంకురార్పణ జరుగుతుంది.
శ్రీ వరాహస్వామివారి ఆలయ విమాన గోపురానికి బంగారు పూత పూసిన రాగి రేకులు అమర్చేందుకు 2020, డిసెంబరు 6 నుండి 10వ తేదీ వరకు బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆలయంలోని ముఖ మండపంలో నమూనా ఆలయం ఏర్పాటు చేసి గర్భాలయంలోని మూలవర్ల తరహాలో అత్తి చెక్కతో విగ్రహాలను ఏర్పాటు చేశారు. స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తున్నారు. విమాన గోపురం పనులు పూర్తి కావడంతో జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.
నవంబరు 24న బుధవారం రాత్రి గం. 7.30 నుండి గం.9.30ల వరకు శ్రీ విష్వక్సేనుల వారిని శ్రీవారి ఆలయం నుండి ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేసి మృత్సంగ్రహణం నిర్వహిస్తారు. రాత్రి గం. 9.30 నుండి గం.10.30ల వరకు శ్రీ వరాహస్వామివారి ఆలయంలో అంకురార్పణ కార్యక్రమాలు చేపడతారు.
నవంబరు 25న ఉదయం 7గంటల నుండి 10 గంటల వరకు శ్రీ వరాహస్వామివారి ఆలయ యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి 8గంటల నుండి 10 గంటల వరకు కళాకర్షణ, ప్రబంధ పారాయణం, వేదపారాయణం చేపడతారు.
Also Read : Alipiri Walk Way : అలిపిరి నడక మార్గంలో భక్తులకు అనుమతి
నవంబరు 26, 27వ తేదీల్లో ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి రాత్రి 8గంటల నుండి 10 గంటల వరకు శ్రీ వరాహస్వామివారి ఆలయ యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా, నవంబరు 27వ తేదీన శ్రీ వరాహస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది.
నవంబరు 28వ తేదీన ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ వరాహస్వామివారి ఆలయ యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మహాశాంతి పూర్ణాహుతి, మహాశాంతి తిరుమంజనం చేపడతారు. రాత్రి 8గంటల నుండి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, శయనాధివాసం నిర్వహిస్తారు.
నవంబరు 29న ఉదయం గం. 7.30 నుండి 9 గంటల వరకు శ్రీ వరాహస్వామివారి ఆలయంలో పూర్ణాహుతి, ప్రబంధ శాత్తుమొర, వేద శాత్తుమొర నిర్వహిస్తారు. ఉదయం గం.9.15 నుండి గం.9.30 వరకు ధనుర్ లగ్నంలో అష్టబంధన మహాసంప్రోక్షణ జరుగనుంది. రాత్రి గం. 7 నుండి 8.30 గంటల వరకు శ్రీ వరాహస్వామివారి ఆలయంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తి ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.