Dussehra : దసరా రోజు జమ్మిచెట్టుకు పూజ చేస్తున్నారా..? కేవలం ఈ సమయాల్లో మాత్రమే ఫూజించాలి.. మీకు ఏడాదంతా విజయాలే..
Dussehra జమ్మి చెట్టును పూజించడం ఆధ్యాత్మికంగా, పురాణాలు, జ్యోతిష్య శాస్త్రం అనే మూడు అంశాల్లో అత్యంత శక్తివంతమైనది.

Dussehra 2025
Dussehra 2025 : తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా హిందువులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగల్లో విజయదశమి (దసరా) ఒకటి. ఈ పండుగ విజయానికి సంకేతంగా చెబుతారు. అయితే, దసరా అంటే ప్రతిఒక్కరికి గుర్తుకొచ్చేది జమ్మిచెట్టు పూజ. ఈ జమ్మిచెట్టును పూజించడం వెనుక పురాణ కథలు కూడా ఉన్నాయి. జమ్మి చెట్టును దుర్గాదేవి మరొక రూపంగా చెబుతారు. దీంతో దసరా రోజున జమ్మి చెట్టును పూజించడం ద్వారా కష్టాలు తొలిగిపోయి విజయం, శుభాలు కలుగుతాయని నమ్ముతారు.
జమ్మి చెట్టును పూజించడం ఆధ్యాత్మికంగా, పురాణాలు, జ్యోతిష్య శాస్త్రం అనే మూడు అంశాల్లో అత్యంత శక్తివంతమైనది. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. విజయ దశమి అంటేనే జమ్మి చెట్టుకు పూజ చేయాల్సిన రోజుఅని పురాణాల్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే జమ్మిచెట్టుకు వృక్షాలలో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. జమ్మి చెట్టును అపరాజితా దేవి (రాజరాజేశ్వరి దేవి) స్వరూపంగా పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. అమ్మవారి స్వరూపంగా జమ్మిచెట్టును పురాణాలు వర్ణిస్తున్నాయి. దసరా రోజు సాయంకాలం సమయంలో జమ్మిచెట్టు వద్ద ప్రత్యేక పూజ చేయాలి.
ఇలా పూజించాలి..
జమ్మిచెట్టు వద్ద మూడు తమలపాకులు ఉంచి.. ఆ మూడు తమలపాకుల్లో మూడు పసుపు ముద్దలు ఉంచాలి. ఆ పసుపు ముద్దలకు పైభాగంలో ఎడమ వైపు.. కుడివైపు కుంకుమ బొట్లను పెట్టాలి. ఆ మూడు పసుపు ముద్దలను కూడా అమ్మవారి స్వరూపంగా భావించాలి. మధ్యలో ఉన్న పసుపు ముద్ద అపరాజితా దేవి, ఎడమవైపు.. అమ్మవారి అనుచరురాలు జయాదేవి, కుడివైపు విజయాదేవిగా భావించాలి. ఆ మూడు పసుపు ముద్దలకు కూడా జమ్మి చెట్టు కింద ఉంచి.. పసుపు కలిపిన అక్షింతలు వేస్తూ.. ఓం అపరాజితాదేవిఐ నమ:.. ఓం జయాదేవిఐ నమ:.. ఓం విజయాదేవిఐ నమ: అనే మంత్రాలను జపిస్తూ పూజ చేయాలి. ఆ పసుపు ముద్దల వద్ద బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. ఇలా చేయడం వల్ల సంవత్సరం అంతా అపరాజితా దేవి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం.
అలా చేయలేని పక్షంలో.. మీ ఇంట్లోని సభ్యులందరి పేర్లు తెల్ల కాగితంపై పెన్నుతో రాసి.. ఆ కాగితాన్ని జమ్మిచెట్టు తొర్రలో ఉంచాలి. జమ్మి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి. ఆ తరువాత ఆ కాగితాన్ని తీసుకెళ్లి ఇంట్లో భద్రపర్చుకోవాలి. అలా చేయడం వల్ల సంవత్సరం అంతా కుటుంబ సభ్యులపై అమ్మవారి సంపూర్ణ అగ్రహం కలుగుతుందని నమ్మకం. అయితే, జమ్మిచెట్టు వద్ద కాగితం పెట్టి ప్రదక్షిణలు చేసే సమయంలో ఈ శ్లోకం అందరూ తప్పకుండా జపించాలి.
“శమీ శమయతే పాపం
శమీ శతృ వినాశనం
అర్జునస్య ధనుర్ధారీ
రామస్య ప్రియ దర్శిని.”
ఇలా చేయడం వల్ల సంవత్సరం మొత్తం అమ్మవారు అపరాజితా దేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవచ్చునని నమ్మకం.