Ayush Mhatre: 4,4,4,6,4,4 .. ఆయుష్ మాత్రే.. ఎవరు బ్రో నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..
రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో మాత్రే ఎంపికైనప్పుడు మొదట్లో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.

Courtesy BCCI
Ayush Mhatre: ఆయుష్ మాత్రే.. క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడీ పేరు మారుమోగిపోతోంది. వయసు 17 ఏళ్లే. కానీ చిచ్చర పిడుగులా ఆడిన తీరు అత్యద్భుతం. వాటే టాలెంటెడ్ క్రికెటర్ అని క్రికెట్ దిగ్గజాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ యంగ్ స్టార్ ఆయుష్ మాత్రే తుఫాన్ ఇన్నింగ్స్ తో ఒక్కసారిగా హైలైట్ అయ్యాడు. అనుభవజ్ఞులైన బౌలర్లను సైతం ఈ టీనేజర్ ఎదుర్కొన్న తీరు అత్యద్భుతం. ఎంతో ఎక్స్ పీరియన్స్డ్ బ్యాట్స్ మెన్ లా మాత్రే బ్యాటింగ్ చేశాడు. ఫోర్లు, సిక్సుల వర్షం కురిపించాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ఆయుష్ మాత్రే విశ్వరూపం చూపించాడు. ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశాడు. 48 బంతుల్లోనే 94 పరుగులు బాదాడు. అతడి ఇన్నింగ్స్ లో 5 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. భువనేశ్వర్ వేసిన ఒక ఓవర్ లో ఏకంగా 26 పరుగులు బాదటం ఇన్నింగ్స్ కే హైలైట్. చిన్న వయసులోనే భారీ ఇన్నింగ్స్ ఆడిన మాత్రేపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మాత్రే స్ట్రోక్‌ప్లే, క్లాసికల్ టెక్నిక్ సూపర్. అతడి టాలెంట్ చూసి అంతా ఫిదా అయిపోయారు.
ఆర్సీబీతో మ్యాచ్ లో ఆయుష్ మాత్రే రెచ్చిపోయాడు. భువనేశ్వర్ వేసిన మూడో ఓవర్ లో వరుసగా 4,4,4,6,4,4 బాదాడు. ఒకే ఓవర్ లో 26 పరుగులు పిండుకున్నాడు. భువీ ఎంతో ఎక్స్ పీరియన్స్డ్ బౌలర్. అలాంటి బౌలర్ ను ఎంతో ధైర్యంగా ఫేస్ చేసి అతడికే చుక్కలు చూపించాడంటే.. మాత్రే టాలెంట్ ఏంటో అర్థమవుతుంది.
ఈ సీజన్ లో CSK విఫలమైనప్పటికీ.. మాత్రే ప్రదర్శన శాశ్వత ముద్ర వేసింది. ఒత్తిడిలోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేసిన తీరు, అతడి మెచ్యూరిటీ లెవెల్స్ ప్రత్యేకంగా నిలిచాయి. అతడు బ్యాటింగ్ చేసిన తీరు అతడి టాలెంట్ కు అద్దం పడుతుంది. ముంబైలోని ఐకానిక్ ఓవల్ మైదానంలో లెక్కలేనన్ని గంటల ప్రాక్టీస్ ద్వారా తాను అభివృద్ధి చేసుకున్న సాంకేతిక నైపుణ్యం, క్రికెట్ తెలివితేటలను మాత్రే ప్రదర్శించాడు.
రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో మాత్రే ఎంపికైనప్పుడు మొదట్లో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. గుజరాత్‌కు చెందిన ఉర్విల్ పటేల్, కేరళకు చెందిన సల్మాన్ నిజార్ వంటి వారు రేసులో ఉన్నారు. అయితే, ఈ ఐపీఎల్‌కు ముందు జట్టు సెలక్షన్.. నెట్స్‌లో మాత్రేను గమనించిన తర్వాత CSK కెప్టెన్ MS ధోని, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇద్దరూ అతని సామర్థ్యాలపై ఎటువంటి సందేహాలు వ్యక్తం చేయలేదు. తాజాగా ఆ యువ బ్యాట్స్‌మన్ సంచలనాత్మక ప్రదర్శనతో తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
ఈ ఐపీఎల్ ఇప్పటికే టీనేజ్ ప్రతిభకు వేదికగా మారింది. కొద్ది రోజుల క్రితం 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ లీగ్‌లో తాను ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్స్‌గా కొట్టడం ద్వారా క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ కొత్త భారతీయ ప్రతిభను ప్రత్యేకంగా నిలబెట్టేది కేవలం టెక్నిక్ లేదా సమయం కాదు. ధైర్యం, ఆకలి, అవిశ్రాంతంగా ఉండే స్ఫూర్తి. మాత్రే నిట్టూర్పు విడవలేదు. వెనుకాడలేదు. దృఢ నిశ్చయంతో బ్యాటింగ్ చేశాడు.
సురేష్ రైనా.. మాత్రేని భారతదేశ గొప్ప ఆటగాళ్లలో ఒకరితో పోల్చాడు. “అతని పాదాలను చూడండి, అతని హెడ్ పొజిషన్ చూడండి. వీరు భాయ్ (వీరేందర్ సెహ్వాగ్) కూడా ఇలాంటి సెటప్‌నే కలిగి ఉన్నాడని నాకు గుర్తుంది. చాలా స్థిరమైన హెడ్, క్రీజులో చాలా స్థిరంగా ఉన్నాడు” అని చెప్పుకొచ్చాడు.
భారత మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా ప్రశంసలతో ముంచెత్తాడు. మాత్రేకు ఉజ్వల భవిష్యత్తు ఉందని చెప్పాడు. “ఆయుష్ మాత్రే ఆడిన షాట్లు సూపర్బ్. స్టార్లతో నిండిన ముంబై ఇండియన్స్ లైనప్‌పై 17 ఏళ్ల బాలుడు అద్భుతమైన షాట్లు ఆడిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది” అని శాస్త్రి అన్నాడు.