Telangana Govt : రైతులకు శుభవార్త.. తెలంగాణ సర్కార్ సంక్రాంతి కానుక.. 50 శాతం రాయితీ

Telangana Govt : వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద సుమారు 15 రకాల యంత్రాలను రైతులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొస్తుంది.

1/9
సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కొనసాగించిన పథకాన్ని మళ్లీ పున:ప్రారంభించింది. ఈ పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిపివేయడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. వారి ఇబ్బందులను తొలగిస్తూ కాంగ్రెస్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
2/9
రేవంత్ సర్కార్ రైతులకు సంక్రాంతి కానుకగా వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పున: ప్రారంభించింది. కొన్నేళ్లుగా నిలిచిపోయిన ఈ పథకాన్ని పునరుద్దరిస్తూ 1,31,182 వ్యవసాయ పరికరాలను 50శాతం రాయితీతో అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.101.93కోట్ల బడ్జెట్ ను కేటాయించింది.
3/9
వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాలలో జరిగిన రైతుమేళా కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ప్రారంభించారు.
4/9
వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద సుమారు 15 రకాల యంత్రాలను రైతులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొస్తుంది. వీటిలో రోటావేటర్లు, బ్యాటరీ స్ప్రేయర్లు, కల్టివేటర్లు, పవర్ టిల్లర్లు, వరి కోత యంత్రాలు, కలుపు తీసే యంత్రాలు, విత్తనాలు చల్లే యంత్రాలు, ఇతర యంత్రాలను ఈ పథకం కింద అందిస్తారు.
5/9
జిల్లాల వారీగా ఇప్పటికే రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఎంపిక ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. మొత్తం 1.31లక్షల పరికరాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
6/9
వ్యవసాయ యాంత్రీకరణతో పాటు రసాయన రహిత సాగును ప్రోత్సహించేందుకు నేషనల్ మిషన్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్ పథకాన్ని కూడా మంత్రులు ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఎకరానికి రూ.4వేల చొప్పున ప్రోత్సాహకం అందించనున్నారు.
7/9
వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులు సబ్సిడీ పొందాలంటే వ్యవసాయ శాఖ అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సాధారణంగా farmmech.telangana.gov.in లేదా సంబంధిత జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆధార్ కార్డు, భూమి యాజమాన్య ధృవీకరణ పత్రాలు, బ్యాంక్ వివరాలు అవసరం. దరఖాస్తులు అధికంగా వస్తే లాటరీ విధానంలో ఎంపిక చేస్తారు. దీనిపై స్పష్టత కోసం ఓసారి సమీప వ్యవసాయ అధికారులను కలిస్తే, పూర్తి వివరాలు వారు చెబుతారు.
8/9
ఈ పథకంలో సన్న, చిన్నకారు రైతులు, మహిళా రైతులు, ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వీరికి సాధారణంగా 50శాతం సబ్సిడీ లభిస్తుంది. సామాన్య రైతులకు 40-50 శాతం వరకు సబ్సిడీ ఉంటుంది. గతంలో ఎస్ఎంఏఎం (సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్) మార్గదర్శకాల ప్రకారం ట్రాక్టర్లపై గరిష్టంగా రూ.75,000 నుంచి రూ.3 లక్షల వరకు, ఇతర యంత్రాలపై 50 శాతం లేదా నిర్దిష్ట మొత్తం సబ్సిడీ లభించేది. ఈ దఫా కూడా ఇదే విధానం అమలవుతుందని అధికారులు తెలిపారు.
9/9
ఈ పథకం ప్రయోజనాలు అనేకం. కూలీలపై ఆధారపడకుండా సమయానికి పనులు పూర్తవుతాయి. సాగు ఖర్చులు తగ్గి రైతులకు ఆర్థిక భారం తగ్గుతుంది.