IPL 2025: సీఎస్‌కేతో మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. క్రిస్ గేల్ రికార్డు బద్దలు.. రోహిత్ శర్మ ఏ స్థానంలో ఉన్నాడంటే?
సీఎస్కే జట్టుతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 33 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఈ క్రమంలో క్రిస్ గేల్ ను వెనక్కునెట్టి సరికొత్త రికార్డును నమోదు చేశాడు.

Credit BCCI
IPL 2025: ఐపీఎల్-2025 టోర్నీలో భాగంగా శనివారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 33 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఐదు ఫోర్లు, ఐదు సిక్సులు బాదాడు. తద్వారా సరికొత్త రికార్డును కోహ్లీ నమోదు చేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 62 పరుగులు చేశాడు. దీంతో సీఎస్కే జట్టుపై 10వ అర్ధ సెంచరీ సాధించాడు. తద్వారా ఐపీఎల్ ఫార్మాట్ లో చెన్నై పై అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన బ్యాటర్ గా కోహ్లీ నిలిచాడు. అంతేకాదు.. ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్ లో ఒకే వేదికపై అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్ మెన్ గా విరాట్ నిలిచాడు. తద్వారా క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు.
KING KOHLI AT THE CHINNASWAMY. pic.twitter.com/LAjzUe7BHP
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 3, 2025
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్ లో 154 సిక్సర్లు బాదాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే వేదికపై అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు క్రిస్ గేల్ పేరుతో ఉంది. క్రిస్ గేల్ చిన్నస్వామి స్టేడియంలో 151 సిక్సులు కొట్టాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ ఐదో స్థానంలో నిలిచాడు. రోహిత్ వాంఖడే స్టేడియంలో 122 సిక్సులు కొట్టాడు.
టీ20 క్రికెట్‌లో ఒకే స్టేడియంలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్లు వీరే..
విరాట్ కోహ్లీ (టీమిండియా) – బెంగళూరులో 154 సిక్సులు
క్రిస్ గేల్ (వెస్టిండీస్) – బెంగళూరులో 151 సిక్సులు
క్రిస్ గేల్ (వెస్టిండీస్) – మీర్పూర్‌లో 138 సిక్సులు
అలెక్స్ హేల్స్ (ఇంగ్లాండ్) – నాటింగ్‌హామ్‌లో 135 సిక్సులు
రోహిత్ శర్మ (టీమిండియా) – వాంఖడేలో 122 సిక్సులు
🚨 HISTORY CREATED BY KOHLI. 🚨
– Virat Kohli becomes the first player to smash 300 sixes for an IPL team. pic.twitter.com/aWtJDPvOpD
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 3, 2025
మరోవైపు.. ఒకే జట్టు తరపున అత్యధిక సిక్సులు కొట్టిన జాబితాలో విరాట్ కోహ్లీ (301 సిక్స్ లు) టాప్ లో కొనసాగుతున్నాడు. కోహ్లీ తరువాత క్రిస్ గేట్ ఆర్సీబీ తరపున 263 సిక్స్ లు కొట్టగా.. ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ శర్మ 262 సిక్స్ లు, కీరన్ పోలార్డ్ 258 సిక్స్ లు, సీఎస్ కే తరపున ధోనీ 257 సిక్స్ లు కొట్టాడు. ఐపీఎల్ లో గత 18 సీజన్లుగా విరాట్ కోహ్లీ ఆర్సీబీ జట్టుకే ఆడుతున్న విషయం తెలిసిందే.
🚨 VIRAT KOHLI – ORANGE CAP HOLDER OF IPL 2025. 🚨 pic.twitter.com/TCvni2vTKV
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 3, 2025
మరోవైపు.. ఐపీఎల్-2025లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లో మంచి ఆటతీరును కనబరుస్తున్నాడు. తద్వారా ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆర్సీబీ జట్టు 11 మ్యాచ్ లు ఆడగా.. విరాట్ కోహ్లీ 505 పరుగులు చేశాడు. తద్వారా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా ఆరంజ్ క్యాప్ నుసొంతం చేసుకున్నాడు.