స్మిత్ సెంచరీ : ఆసీస్ 338 ఆలౌట్.. నిలకడగా టీమిండియా

3rd Test-Sydney-India trail by 308 runs : టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 338 పరుగులకు చాపచుట్టేసింది. 166/2 ఓవర్‌ నైట్‌ స్కోరుతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు ఆసీస్‌ రెండో రోజు ఇన్నింగ్స్‌ ఆట ఆరంభించింది. రెండో రోజు ఆటలో మరో 172 పరుగులు జోడించి మరో 8 వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్‌ ఆటగాళ్లు లబూషేన్‌ (91), స్టీవ్‌ స్మిత్‌(131) సెంచరీ నమోదు చేశాడు.

స్మిత్‌ చెలరేగడంతో ఆసీస్ స్కోరు పరుగులు పెట్టించాడు. మిగతా ఆటగాళ్లలో మిచెల్‌ స్టార్క్‌(24) రాణించగా.. తొలి రోజు ఆటలో విల్‌ పకోవ్‌స్కీ (62) హాఫ్‌ సెంచరీ సాధించాడు. లబుషేన్‌ స్మిత్‌తో కలిసి మూడో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే జడేజా బౌలింగ్‌లో లబుషేన్‌ రహానె చేతికి చిక్కడంతో ఆసీస్‌ 206 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.

ఆపై వచ్చిన బ్యాట్స్‌మెన్‌ వచ్చినట్లు పెవిలియన్‌ బాటపట్టారు. స్మిత్‌ ఒంటరిపోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. మాథ్యూ వేడ్‌(13), కెప్టెన్‌ టిమ్‌పైన్‌(1), గ్రీన్‌(0), కమిన్స్‌(0), లైయన్‌(0) పూర్తిగా విఫలమయ్యారు. టీమ్‌ఇండియా బౌలర్లలో జడేజా 4 వికెట్లు, బుమ్రా, సైని 2 వికెట్లు, సిరాజ్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.

ఆస్ట్రేలియా రెండో రోజు ఇన్నింగ్స్‌ లో 338 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, సుభమన్ గిల్ నిలకడగా ఆడుతున్నారు. రెండో సెషన్‌ పూర్తయ్యే సమయానికి రోహిత్‌ శర్మ(11), శుభ్‌మన్‌గిల్‌(16) పరుగులతో క్రీజులో ఉన్నారు. 12 ఓవర్లు భారత్‌ స్కోర్‌ 28/0గా ఇన్నింగ్స్ కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్‌ 308 పరుగులతో వెనుకంజలో ఉంది.