నాకు బెదింపు కాల్స్ వచ్చాయి.. ఇండియాకు రావద్దని హెచ్చరించారు: టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి
"2021 తర్వాత నేను చాలా మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. నా డైలీ రొటీన్, ప్రాక్టీస్ అన్నింటినీ మార్చుకున్నాను" అని అన్నాడు.

టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీ20 వరల్డ్ కప్-2021లో నిరాశపరిచాడు. అయితే, ఇటీవల ముగిసిన ఛాంపియన్ ట్రోఫీలో ఈ స్పిన్నర్ మూడు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టి, భారత జట్టు టైటిల్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. టీమిండియాలో ఇప్పుడు కీలకమైన ఆటగాడిగా మారాడు. దీంతో టీ20 వరల్డ్ కప్-2021 తర్వాత తనకు ఎదురైన అనుభవాలను గురించి గుర్తుచేసుకున్నాడు.
2021 టీ20 వరల్డ్ కప్‌లో వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. అప్పట్లో పాకిస్థాన్ చేతిలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ జట్టులో కూడా వరుణ్ చక్రవర్తి ఉండడం అభిమానులను మరింత నిరాశపరిచింది. టోర్నమెంట్ ముగిసిన తర్వాత తీవ్ర మనోవేదనను అనుభవించానని వరుణ చక్రవర్తి వెల్లడించాడు. అంతేకాక, కొంతమంది బెదిరింపు కాల్స్ చేసి, భారతదేశానికి తిరిగి రాకూడదని హెచ్చరించారని తెలిపాడు.
“2021 టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ నా జీవితంలో అత్యంత మనో వేదన అనుభవించిన టోర్నమెంట్. ఈ లీగ్ లో నేను కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాను. ఆ తర్వాత మూడు సంవత్సరాలు జట్టులోకి నన్ను ఎంపిక చేయలేదు. జట్టులోకి తిరిగి రావడం నా అరంగేట్ర కంటే కఠినంగా అనిపించింది” అని వరుణ్ ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో చెప్పాడు.
“2021 వరల్డ్ కప్ తర్వాత నాకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. భారతదేశానికి రాకూడదు, వస్తే సజీవంగా ఉండలేవు అంటూ హెచ్చరించారు. కొంతమంది నా ఇంటి దగ్గరకు వచ్చారు. నేను ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి వస్తున్నప్పుడు, కొందరు బైకులపై వెంబడించారు. అభిమానులు భావోద్వేగంగా ఉంటారని నాకు తెలుసు, కానీ ఆ పరిస్థితిని ఎదుర్కోవడం కష్టం” అని అన్నాడు.
చాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌పై గ్రూప్ స్టేజ్‌లో ఐదు వికెట్లు తీసిన వరుణ్, సెమీఫైనల్ (ఆస్ట్రేలియా), ఫైనల్ (న్యూజిలాండ్) మ్యాచ్‌ల్లో రెండేసి వికెట్లు తీయడంతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్‌లో కివీస్ ఓపెనింగ్ వికెట్ పడగొట్టి మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పాడు.
“2021 తర్వాత నేను చాలా మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. నా డైలీ రొటీన్, ప్రాక్టీస్ అన్నింటినీ మార్చుకున్నాను. గతంలో సెషన్‌కు 50 బంతులు మాత్రమే ప్రాక్టీస్ చేసేవాడిని, ఇప్పుడు దాన్ని రెట్టింపు చేసుకున్నాను. సెలెక్టర్లు తిరిగి అవకాశం ఇస్తారో లేదో తెలియకపోయినా కష్టపడ్డాను. మూడో ఏడాది అయ్యాక ఇక అవకాశాలు లేవనుకున్నా.. ఐపీఎల్ 2024 ట్రోఫీని మా టీం కేకేఆర్ గెలిచిన తర్వాత నాకు జాతీయ జట్టులో అవకాశం వచ్చింది” అని వరుణ్ చెప్పాడు.
“నా కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లను చూశాను. విమర్శలెంత తీవ్రంగా ఉంటాయో నాకు తెలుసు. కానీ ఇప్పుడు అదే అభిమానులు ప్రశంసిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది” అని వరుణ్ అన్నాడు.