Air India Crash : ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన వారిలో 23 ఏళ్ల యువ క్రికెటర్ కూడా..
ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన వారిలో లీడ్స్ మోడరన్యన్స్ క్రికెట్ క్లబ్ తరపున క్రికెట్ ఆడిన 23 ఏళ్ల క్రికెటర్ దిర్ధ్ పటేల్ కూడా ఉన్నాడు.

Air India Crash Cricketer Dirdh Patel Confirmed Among Victims
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం.. ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 274 మందికి పైగా మరణించారు. వీరిలో 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా.. మిగిలిన వారు నివాస సముదాయంలోని ప్రజలు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో లీడ్స్ మోడరన్యన్స్ క్రికెట్ క్లబ్ తరపున ఆడిన 23 ఏళ్ల క్రికెటర్ దిర్ధ్ పటేల్ కూడా ఉన్నాడు.
జూన్ 12న (గురువారం) మధ్యాహ్నాం 1.38 గంటలకు అహ్మదాబాద్ నుంచి లండన్ బయలు దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే విమానాశ్రయానికి సమీపంలోనే కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు సహా 12 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఒక్క ప్రయాణికుడు గాయాలతో బయడపడ్డాడు.
ENG vs IND : ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక టెస్టు విజయాలు సాధించిన భారత కెప్టెన్ ఎవరో తెలుసా?
ఈ విమాన ప్రయాణికుల్లో దిర్ధ్ పటేల్ కూడా ఉన్నాడు. అతడి మరణవార్తను బిబిసి, ఎయిర్‌డేల్ & వార్ఫెడేల్ సీనియర్ క్రికెట్ లీగ్ ధ్రువీకరించాయి. లీడ్స్ మోడరన్నియన్స్ క్రికెట్ క్లబ్ తరపున 2024లో దిర్ధ్ పటేల్ ఆడాడు. 20 మ్యాచ్‌ల్లో 312 పరుగులు చేశాడు. 29 వికెట్లు పడగొట్టాడు.
‘ప్రతిభావంతుడైన ఆల్ రౌండర్ అయిన మిస్టర్ పటేల్ 2024 సీజన్‌లో లీడ్స్ మోడరన్నియన్స్ క్రికెట్ క్లబ్ తరపున విదేశీ ఆటగాడిగా ఆడాడు. అతని మరణ వార్త తమకు ఎంతో బాధకలిగించింది. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.’ అని క్లబ్ ఓ ప్రకటనలోతెలిపింది.
గుజరాత్‌కు చెందిన పటేల్ హడర్స్‌ఫీల్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. ఇటీవలే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి టెక్ పరిశ్రమలో కెరీర్‌ను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు.