APL 2024: పుంజుకున్న రాయలసీమ కింగ్స్‌, గోదావరి టైటాన్స్‌పై విజయం

కింగ్స్‌తో పోరులో టైటాన్స్‌ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. కింగ్స్‌ బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ మైదానం నలువైపులా బౌండరీలతో విజృంభించారు.

APL 2024: పుంజుకున్న రాయలసీమ కింగ్స్‌, గోదావరి టైటాన్స్‌పై విజయం

APL 2024 Rayalaseema Kings beat Godavari Titans won by 7 wickets

APL 2024 RYLS vs GOD : ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌(ఏపీఎల్‌)లో రాయలసీమ కింగ్స్‌ అద్భుత విజయంతో పుంజుకుంది. విశాఖపట్నంలోని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాయలసీమ కింగ్స్‌ 7 వికెట్ల తేడాతో గోదావరి టైటాన్స్‌పై ఘన విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. టైటాన్స్‌ తరఫున ఓపెనర్లు పవర్‌ప్లే ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 28 పరుగులు చేశారు. వంశీకృష్ణ 35 బంతుల్లో 57 పరుగులతో ఆకట్టుకున్నాడు. కింగ్స్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ అర్ధసెంచరీ చేసిన వంశీ రనౌట్‌తో నిష్క్రమించాడు. ఆ తర్వాత ప్రసాద్‌(16 బంతుల్లో 21), శశికాంత్‌(19 బంతుల్లో 36) రాణించడంతో టైటాన్స్‌ పోరాడే స్కోరు అందుకుంది. గిరినాథ్‌రెడ్డి, సత్యరాజు రెండేసి వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.

ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన రాయలసీమ కింగ్స్‌ తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ హనీశ్‌రెడ్డి వికెట్‌ కోల్పోయింది. ప్రశాంత్‌కుమార్‌, రోషన్‌కుమార్‌(17 బంతుల్లో 39) ఇద్దరు కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో పడేశారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత గుట్టా రోహిత్‌(47 బంతుల్లో 70), రోషన్‌కుమార్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 71 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌తో జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు.

Also Read : మీ దుంప‌లు తెగ‌.. ఓ దుప్ప‌టి, దిండు కూడా తెచ్చుకోక‌పోయారా..? ప‌రుపుల‌పై పాక్ ఆటగాళ్ల క్యాచింగ్ ప్రాక్టీస్‌..

కింగ్స్‌తో పోరులో టైటాన్స్‌ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. కింగ్స్‌ బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ మైదానం నలువైపులా బౌండరీలతో విజృంభించారు. టైటాన్స్‌ బౌలర్లు కేవలం మూడు వికెట్లు పడగొట్టి నిరాశపరిచారు. ఈనెల 7న ఉత్తరాంధ్ర లయన్స్‌తో రాయలసీమ కింగ్స్‌ తమ తదుపరి మ్యాచ్‌లో తలపడనుంది.