ఫెదరర్‌కు షాక్: ప్రి క్వార్టర్స్‌లోనే పరాజయం

ఫెదరర్‌కు షాక్: ప్రి క్వార్టర్స్‌లోనే పరాజయం

Updated On : June 23, 2021 / 11:59 AM IST

ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన రోజర్ ఫెదరర్.. క్వార్టర్ ఫైనల్ బరిలో విఫలమైయ్యాడు. 21సంవత్సరాల అనుభవమున్న ప్లేయర్ 20 ఏళ్ల గ్రీసు కుర్రాడు చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. హోరాహోరీ పోరులో ఫెదరర్‌కు షాకిస్తూ గ్రీస్‌ కుర్రాడు సిట్సిపాస్‌ కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లాడు. తొలి మూడు రౌండ్‌లలో అలవోకగా ప్రత్యర్థుల ఆట కట్టించిన స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మాత్రం బెడిసికొట్టాడు.

రికార్డు స్థాయిలో ఏడోసారి ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ స్విస్‌ స్టార్‌కు… కెరీర్‌లో కేవలం ఆరో గ్రాండ్‌స్లామ్‌ ఆడుతోన్న సిట్సిపాస్‌ ఊహించని షాక్‌ ఇచ్చాడు. 3 గంటల 45 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 14వ సీడ్‌ సిట్సిపాస్‌ 6–7 (11/13), 7–6 (7/3), 7–5, 7–6 (7/5)తో మూడో సీడ్‌ ఫెడరర్‌పై గెలిచి కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
అంతేకాకుండా గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి గ్రీస్‌ ప్లేయర్‌గానూ గుర్తింపు పొందాడు.

12 బ్రేక్‌ పాయింట్‌ అవకాశాలు రాగా అన్నింటినీ వృథా చేశాడు. అద్భుతంగా ఫోర్‌హ్యాండ్‌ షాట్లు ఆడే ఫెదరర్‌.. ఈ మ్యాచ్‌లో మాత్రం లయ తప్పాడు. కీలక సమయాల్లో పేలవ ఫోర్‌హ్యాండ్‌ షాట్లు ఆడాడు. అతడి 55 అనవసర తప్పిదాల్లో 33 ఫోర్‌హ్యాండ్‌తో చేసినవే కావడం గమనార్హం. ఫెదరర్‌ రెండో సెట్లో నాలుగు సెట్‌ పాయింట్లను ఉపయోగించుకోలేకపోవడం మ్యాచ్‌కే మలుపు. ఆ సెట్‌ను చేజిక్కించుకున్న తర్వాత సిట్సిపాస్‌ మరింత ఉత్సాహంతో ఆడాడు. మ్యాచ్‌లో అతడు 20 ఏస్‌లు కొట్టగా.. ఫెదరర్‌ 12 ఏస్‌లు సంధించాడు.

సిట్సిపాస్‌ స్పందన:
ఈ అనుభూతిని చెప్పడానికి నా వద్ద మాటలు లేవు. ఈ భూమి మీద ఇప్పుడు అందరికన్నా సంతోషంగా ఉంది నేనేనేమో. ఆరేళ్ల వయస్సున్నప్పటి నుంచి ఫెదరర్‌ను ఆరాధిస్తున్నాను. ఫెదరర్‌ అంటే నాకెంతో గౌరవం. మరో దిగ్గజం రాడ్‌ లేవర్‌ పేరిట ఉన్న సెంటర్‌ కోర్టులోనే ఫెదరర్‌తో ఆడే అవకాశం రావడంతో నా కల నిజమైంది. ఈ ఫలితాన్ని ఎలా వర్ణించాలో కూడా మాటలు రావడంలేదు’ అని విజయం అనంతరం సిట్సిపాస్‌ వ్యాఖ్యానించాడు.

ఓటమి అనంతరం ఫెదరర్: 
నేను మంచి ప్లేయర్‌ చేతిలోనే ఓడిపోయాను. ఇటీవల కాలంలో సిట్సిపాస్‌ చాలా బాగా ఆడుతున్నాడు. కీలక సమయాల్లో అతను ఎంతో ఓర్పుతో ఆడాడు.

సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆదివారం సంచలనాలు చెలరేగాయి. ఒకే రోజు టాప్‌-10లోని నలుగురు సీడెడ్‌ క్రీడాకారులు ఇంటిబాట పట్టారు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ రోజర్‌ ఫెదరర్‌.. గతేడాది రన్నరప్, మారిన్‌ సిలిచ్‌, దిమిత్రోవ్‌‌లు కూడా విఫలమై నిష్క్రమించారు. మహిళల సింగిల్స్‌ విభాగంలో రెండో సీడ్‌ ఎంజెలిక్‌ కెర్బర్‌… మాజీ చాంపియన్‌ షరపోవా… ఐదో సీడ్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌ కూడా ప్రిక్వార్టర్స్‌తోనే సరిపెట్టుకున్నారు.