IND vs PAK: విరాట్ కోహ్లీ సెంచరీ చేయడానికి ఇలా సాయం చేశాను: అక్షర్ పటేల్
చివరికి తాను కూడా కోహ్లీ సెంచరీ విషయంలో క్రీజులో కొన్ని లెక్కలు వేసుకున్నానని అక్షర్ తెలిపాడు.

Pic Credit ANI
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్- పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచులో టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ చేయడానికి అక్షర్ పటేల్ క్రీజులో సహకరించిన విషయం తెలిసిందే. క్రీజులోకి అక్షర్ పటేల్ వచ్చిన సమయంలో టీమిండియా ఛేజ్ పూర్తి చేయడానికి 19 పరుగులు అవసరం.
అలాగే, విరాట్ కోహ్లీ తన సెంచరీ పూర్తి చేయడానికి 14 పరుగులు అవసరం. ఆ సమయంలో కోహ్లీ సెంచరీ చేయడానికి అక్షర్ అందించిన సహకారం మర్చిపోలేనిది. ఈ మ్యాచ్ గురించి అక్షర్ మాట్లాడుతూ మ్యాచ్‌లో తన అనుభవాలను చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ పోస్ట్ చేసింది.
విరాట్ కోహ్లీ చేసిన సెంచరీ గురించి అక్షర్ మాట్లాడుతూ.. డ్రెస్సింగ్ రూమ్ నుంచి తాను మొదటిసారి హై ప్రెజర్ గేమ్‌ను చూశానని అన్నాడు. 50 ఓవర్ల మ్యాచులో మొదట అంతసేపు ఫీల్డింగ్ చేసిన తర్వాత కూడా క్రీజులో అంత ఎనర్జీతో కోహ్లీ ఆడిన తీరు ఆయన ఫిట్‌నెస్‌ను సూచిస్తోందని అన్నాడు.
చివరికి తాను కూడా కోహ్లీ సెంచరీ విషయంలో క్రీజులో కొన్ని లెక్కలు వేసుకున్నానని అక్షర్ తెలిపాడు. తనకు చాలా ఫన్ దక్కిందని చెప్పాడు. విరాట్ కోహ్లీ సెంచరీని పూర్తి చేయాలని తాను భావించడంతో, తాను క్రీజ్‌లో చాలా జాగ్రత్తగా వ్యవహరించానని తెలిపాడు. మ్యాచ్ చివరలో విరాట్ కోహ్లీ శతకాన్ని దృష్టిలో ఉంచుకుని అక్షర్ క్రీజులో అతడికి బ్యాటింగ్ ఇవ్వడానికి సింగిల్ తీశాడు. దీంతో బ్యాటింగ్ చేసిన కోహ్లీ ఫోర్ కొట్టి, సెంచరీ పూర్తి చేసుకుని జట్టుని గెలిపించాడు.
కాగా, భారత్- పాకిస్థాన్ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 49.4 ఓవర్లలో 241 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో టీమిండియా ధాటిగా ఆడి 42.3 ఓవర్లలో 244/4 పరుగులు చేసి, 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. పాకిస్థాన్ తన తదుపరి మ్యాచును బంగ్లాదేశ్‌తో ఈ నెల 27న ఆడనుంది. ఇండియా తన తదుపరి మ్యాచును న్యూజిలాండ్‌తో మార్చి 2న ఆడనుంది.
View this post on Instagram