U19 Asia Cup 2025 : ఫైనల్‌లో పాక్ చేతిలో ఘోర ఓటమి.. బీసీసీఐ సీరియస్.. ఇక..
దుబాయ్ వేదికగా జరిగిన అండర్-19 ఆసియాకప్ 2025లో (U19 Asia Cup 2025) భారత్ నిరాశపరిచింది.
BCCI to seek explanation from team management after U19 Asia Cup Final Loss
U19 Asia Cup 2025 : దుబాయ్ వేదికగా జరిగిన అండర్-19 ఆసియాకప్ 2025లో భారత్ నిరాశపరిచింది. అన్ని మ్యాచ్‌ల్లో అదరగొట్టిన భారత జట్టు కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో 191 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో సమీర్ మిన్హాస్ (172; 113 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్స్‌లు) సెంచరీ బాదాడు. టీమ్ఇండియా బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ మూడు, హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 348 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ 26.2 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో దీపేష్ దేవేంద్రన్(36), వైభవ్ సూర్యవంశీ (26)లు పర్వాలేదనిపించారు.
U19 Asia Cup 2025 : ఫైనల్‌లో భారత్ పై విజయం.. పాక్ ఆటగాళ్ల పై ప్రధాని కనకవర్షం..
కాగా.. ఫైనల్ మ్యాచ్‌లో చిత్తుగా ఓడడం పై బీసీసీఐ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. సోమవారం ఆన్‌లైన్‌లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బోర్డు సభ్యులు ఈ విషయం పై చర్చించినట్లు క్రిక్‌బజ్ తెలిపింది. భారత జట్టు పెర్ఫామెన్స్ పై సమీక్ష అవసరం అని నిర్ణయించినట్లు పేర్కొంది.
సాధారణంగా ఏదైనా టోర్నమెంట్ తర్వాత జట్టు మేనేజర్ ఎల్లప్పుడూ బీసీసీఐకి నివేదికను సమర్పిస్తాడు. ఈసారి బీసీసీఐ మాత్రం టీమ్‌మేనేజ్‌మెంట్ నుంచి వివరణ కోరే అవకాశం ఉంది. హెడ్ కోచ్ హృషికేశ్ కనిత్కర్, కెప్టెన్ ఆయుష్ మాత్రేలతో బోర్డు చర్చించనుంది.
2026 జనవరిలో అండర్ -19 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ మెగాటోర్నీకి ముందు జట్టులోని లోపాలను సరిదిద్ది, టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసేలా చర్యలు చేపట్టనుంది.
