క్రికెట్‌లో కొత్త రూల్: మ్యాచ్ టై అయితే ఇదే

క్రికెట్‌లో కొత్త రూల్: మ్యాచ్ టై అయితే ఇదే

Updated On : September 24, 2019 / 3:02 PM IST

మ్యాచ్ టైగా ముగిస్తే గెలిచిన జట్టును నిర్దేశించడానికి వాడే బౌండరీల పద్ధతిని మార్చేస్తున్నారు. ప్రపంచమంతా వేయి కళ్లతో ఎదురుచూసిన వరల్డ్ కప్ 2019టోర్నీ ఇలాంటి పరిస్థితుల్లోనే ముగిసింది. స్కోర్లు సమంగా ముగియడం, సూపర్ ఓవర్ కూడా టై కావడంతో బౌండరీల పద్ధతి ద్వారా గెలిచిన జట్టును ప్రకటించారు. విన్నింగ్ టీంకు ఓకే అయినా మిగిలిన వారికి ఈ పద్ధతి అస్సలు నచ్చడం లేదు. 

ఈ పద్ధతికి చరమగీతం పాడాలని బిగ్ బాష్ టీ20లీగ్‌లో కొత్త క్రికెట్ రూల్ తీసుకొచ్చారు. టై అయిన వెంటనే సూపర్ ఓవర్ ఆడించి అందులోనూ ఇరు జట్లకు సమమైన స్కోరు సాధిస్తే బౌండరీలను లెక్కపెట్టి విజేతను ప్రకటించేవారు. ఇప్పుడు గెలిచేంత వరకూ సూపర్ ఓవర్ కొనసాగిస్తారు. ఈ కొత్త రూల్‌ను బిగ్ బాష్ లీగ్‌లో మొదలుపెడుతూ ఇది మహిళల, పురుషుల టీ20ఫార్మాట్‌లో ప్రయోగించనున్నారు. 

ఈ రూల్ దాదాపు సిరీస్ ఫైనల్‌ మ్యాచ్‌లో వాడనున్నట్లు తెలుస్తోంది. భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఈ బౌండరీల పద్ధతికి అయిష్టంగా ఉన్నట్లు ప్రకటించింది. ఆండ్రూ స్ట్రాస్, మహేలా జయవర్ధనె, రాహుల్ ద్రవిడ్, షాన్ పొలాక్‌లు ఉన్న కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అల్లార్డిస్ తెలిపారు. దీనిని ఐసీసీ కూడా ఆమోదిస్తే అంతర్జాతీయ మ్యాచ్‌లలోనూ కొత్త రూల్ మొదలుపెట్టేస్తారు.