Buchi Babu tournament : బుచ్చిబాబు టోర్నీ విజేతగా హైదరాబాద్..
ఆల్ఇండియా బుచ్చిబాబు టోర్నమెంట్ విజేతగా హైదరాబాద్ జట్టు నిలిచింది.

Buchi Babu Tournament Hyderabad beats Chhattisgarh by 243 runs to clinch title
Buchi Babu tournament : ఆల్ఇండియా బుచ్చిబాబు టోర్నమెంట్ విజేతగా హైదరాబాద్ జట్టు నిలిచింది. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో హైదరాబాద్ జట్టు అసాధారణ ప్రదర్శన చేసి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఛత్తీస్‌ఘడ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 243 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది.
518 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఛత్తీస్‌ఘడ్ 247 పరుగులకే కుప్పకూలింది. ఛత్తీస్‌ఘడ్ బ్యాటర్లలో ఓపెనర్ ఆయుష్ పాండే (134 బంతుల్లో 117; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో పోరాడాడు. అతడికి తోడుగా మరో ఓపెనర్ శశాంక్ చంద్రకర్ (45 బంతుల్లో 50; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ ఐదు వికెట్లతో ఛతీస్‌ఘడ్ పతనాన్ని శాసించాడు. అనికేత్ రెడ్డి రెండు వికెట్లు తీశాడు. రోహిత్ రాయుడు, నితేష్ కన్నాల, తన్మయ్ అగర్వాల్ తలా ఓ వికెట్ సాధించారు.
ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 417 పరుగులు చేసింది. రోహిత్ రాయుడు(260 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో 155) భారీ శతకాన్ని సాధించాడు. ఆ తరువాత ఛత్తీస్‌ఘడ్ మొదటి ఇన్నింగ్స్‌లో 281 పరుగులే చేసింది. దీంతో హైదరాబాద్‌కు 236 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఛత్తీస్‌ఘడ్ ముందు భారీ లక్ష్యం నిలిచింది.